శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 13 జనవరి 2021 (17:23 IST)

డీజీపీ ప్రకటన బెదిరించేలా ఉంది : టీడీపీ నేత జవహర్

రాష్ట్రంలో ఏడాదిన్నరగా దేవాలయాలకు సంబంధించి 140 ఘటనలు జరిగాయి. విజయవాడ నడిబొడ్డున, దేవాదాయ మంత్రి నియోజకవర్గంలో దుర్గగుడి రథం మూడు సింహాలు కట్ చేసి తీసుకెళ్లారు. నేరస్థుల్ని ఇంతవరకు ఎందుకు పట్టుకోలేదు? ఏపీ పోలీసులకు సాంకేతిక పరిజ్ఞానంలో నైపుణ్యం లేదని, సామర్థ్యం లేదని తెలుగుదేశం ఎన్నడూ ఆరోపణలు చేయలేదు. 
 
ప్రతిష్టాత్మక ఏపీ పోలీస్ వ్యవస్థపై జగన్ రెడ్డి పార్టీ నేతల ఒత్తిడులకు అధికంగా తలవంచడం వల్ల ప్రతిష్టకు భంగం వాటిల్లుతున్నది. ఇప్పుడైనా వైకాపా ఒత్తిడులకు లొంగకుండా చట్టానికి డీజీపీ గారు పెద్దపీట వేస్తే వారికి తిరిగి గౌరవం పెరుగుతుంది. అలాకాకుండా వైకాపా నేతల అవినీతిని ప్రశ్నించిన వారికి శిరోముండనాలు చేస్తే ఫలితం రాదు. 
 
ఫిర్యాదులు చేసే భక్తుల్ని, పౌరుల్ని, పత్రికల్ని, ప్రతిపక్షాల్ని బెదిరిస్తే ప్రతిష్ట పెరగదని గుర్తించాలి. హైకోర్టు రిజిస్ట్రార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోషల్ మీడియాలో న్యాయమూర్తుల్ని బెదిరించిన వారిపై చర్యలు తీసుకుంటే ప్రతిష్ట పెరుగుతుంది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్యలో నేరస్థుల్ని బోనులో ప్రవేశపెడితే ప్రతిష్ట పెరుగుతుంది. 
 
దేవాలయాలన్నింటిపై దాడులు చేసిన నిజమైన దోషుల్ని బోనులో నిలబెడితే ప్రతిష్ట పెరుగుతుంది గాని ప్రతిపక్షాల్ని, భక్తుల్ని, పౌరుల్ని బెదిరించినా, అక్రమ కేసులు పెట్టినా ప్రతిష్ట మరింత దిగజారుతుందని గుర్తించాలి. దేవాలయాల దాడులపై సీబీఐకి అప్పగించి రాష్ట్రంలో కుల, మత, ప్రాంతీయ చిచ్చుపెట్టే రాజకీయాలకు, కుట్రలకు ఫుల్ స్టాప్ పెట్టాలి.