గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 10 జనవరి 2021 (18:45 IST)

జగన్ రెడ్డి మౌనం వల్లే దేవాలయాలపై దాడులు : అచ్చెన్నాయుడు

హిందూ దేవాలయాలపై రోజుకో చోట విధ్వంసం జరుగుతున్నా ఏపీ సీఎం జగన్ రెడ్డి మౌనం వహిస్తున్నారని, ఆయన ఇప్పటికైనా మౌనం వీడాలని టీడీపీ ఏపీ శాఖ అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో దేవాలయం అనేది లేకుండా కుట్ర చేస్తున్నారు. జగన్ రెడ్డి ప్రోద్బలంతోనే విధ్వంసాలు జరుగుతున్నాయి. ఈ దాడులకు ఎప్పుడు అడ్డుకట్ట పడుతుందో దేవుడికే తెలియాలి. 
 
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో యల్లంపల్లి ఆంజనేయస్వామి ఆలయం తలుపులు పగులగొట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. జగన్ రెడ్డి 19 నెలల పాలనలో హిందూ దేవాలయాలపై 140కి పైగా దాడులు జరిగాయి. ఏ ఘటనలోనూ ఇంతవరకు దోషులను పట్టుకున్న పాపాన పోలేదు. హిందూమతంపై జరుగుతున్న దాడిపై జగన్ రెడ్డి మౌనం వీడాలి. అన్ని మతాలను సమానంగా చూడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై లేదా? 
 
పథకం ప్రకారం హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. విగ్రహాల ధ్వంసం నుంచి ప్రజలను తప్పుదారి పట్టించేందుకు విజయవాడలో ఆలయాల పునరుద్ధరణ అంటూ కొత్త నాటకానికి తెరతీశారు. అభివృద్ధికి, విధ్వంసానికి తేడా ఉంది. హిందూ విశ్వాసాలపై ఎందుకంత అలుసు? జగన్ రెడ్డి హిందూ మతాన్ని అభిమానించే వారైతే.. అమరావతిలో రూ.150 కోట్లతో తలపెట్టిన వేంకటేశ్వర స్వామి నిర్మాణాన్ని ఎందుకు నిలిపివేశారు? 
 
దివ్యదర్శనం పథకాన్ని ఎందుకు ఆపారు? కృష్ణా, గోదావరి పవిత్ర సంగమం వద్ద నిర్వహించే హారతి కార్యక్రమాన్ని ఎందుకు నిలిపివేశారు? దేవాదాయశాఖ నిధులను దారి మళ్లిస్తున్నారు. దేవాలయ భూములను అన్యాక్రాంతం చేస్తున్నారు. అంతర్వేది రథం దగ్ధంపై సీబీఐ విచారణ ఏమైంది? దేవాలయాలపై పథకం ప్రకారం జరుగుతున్న దాడులకు ముగింపు పలకని పక్షంలో ప్రజా పోరాటం తప్పదు.