మద్యం దుకాణాల వద్ద డ్యూటీ ముద్దుగా ఉంటుందా? టీడీపీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను నిర్వహించేందుకు ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీచేసింది. అయితే, కరోనా మహమ్మారిని సాకుగా చూపి ఈ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సమ్మతించడం లేదు. అయినప్పటికీ ఈసీ ముందుకు వెళుతోంది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు స్పందించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల విధులు నిర్వహించలేమని అన్నారు. కాదుకూడదు అనుకుంటే మూకుమ్మడిగా సామూహిక సెలవుపై వెళతామని హెచ్చరించారు.
ఈ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు మండిపడున్నారు. ఉద్యోగ సంఘం నేతలు అధికార పార్టీ సేవకులుగా మారారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుధాకర్‌రెడ్డి మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల డ్యూటీ వద్దనే వారికి వైన్‌షాపుల వద్ద డ్యూటీ ముద్దుగా ఉందా అని ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతున్న తీరు అభ్యంతరకరమన్నారు.
చంద్రశేఖర్ రెడ్డికి వైసీపీ నేతలతో బంధుత్వం ఉందన్నారు. వెంకట్రామ రెడ్డి భార్య శ్వేతారెడ్డి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరపున ప్రచారం చేశారన్నారు. కులం, స్వార్థం కోసమే సీఎం జగన్ రెడ్డిని వెనకేసుకొస్తున్నారని మండిపడ్డారు. పీఆర్సీ, సీపీఎస్ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల భద్రత ఏనాడూ పట్టించుకోలేదని దుయ్యబట్టారు. ఎన్నికల డ్యూటీ చేస్తే ప్రాణాలు పోతాయనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వేలాది మందితో ఊరేగింపులు సభలు నిర్వహిస్తే రాని కరోనా ఎన్నికలు నిర్వహిస్తే ఎలా వస్తుందని సుధాకర్‌రెడ్డి ప్రశ్నించారు.