శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 17 నవంబరు 2020 (21:24 IST)

వైకాపా పతనం శ్రీవారి పాదాల చెంత నుంచే ప్రారంభంకావాలి : చంద్రబాబు

అప్రజాస్వామ్య పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైకాపా ప్రభుత్వ పతనం తిరుమల శ్రీవారి పాదాల చెంత నుంచే ప్రారంభంకావాలని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. 
 
ఆయన మంగళవారం టీడీపీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వర్చువల్ సమావేశంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాల టీడీపీ ఇన్చార్జిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, తిరుపతి పార్లమెంట్ స్థానం ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా, జగన్మోహన్ రెడ్డి పతనం తిరుపతి నుంచే ప్రారంభం కావాలని పిలుపునిచ్చారు. తిరుపతి ఉప ఎన్నికలు వైసీపీ అరాచకాలకు గుణపాఠం చెప్పే వేదిక కావాలని ఆయన కోరారు. తిరుపతి లోక్‌సభ నుంచి ప్రాతినిథ్యం వహిస్తూ వచ్చిన వైకాపా ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ రావు కరోనా వైరస్ సోకి మరణించిన విషయం తెల్సిందే. దీంతో తిరుపతి లోక్‌సభకు త్వరలో ఉప ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా మాజీ ఎంపీ పనబాక లక్ష్మీ పేరును చంద్రబాబు ప్రకటించిన విషయం తెల్సిందే. 
 
ఇకపోతే, స్థానిక సంస్థల ఎన్నికల అంశంలోనూ చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ బెదిరింపులకు పాల్పడి నామినేషన్లు విత్ డ్రా చేయించిందని ఆరోపించారు. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను పూర్తిగా రద్దు చేయాలని, ఎన్నికల అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 
 
మళ్లీ నోటిఫికేషన్ జారీ చేసి ఆన్‌లైన్ నామినేషన్లకు అనుమతించాలని కోరారు. కేంద్ర భద్రతా బలగాల పర్యవేక్షణలో ఎన్నికలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, టీడీపీకి పేరు వస్తుందనే అమరావతి, పోలవరం ఆపేశారని విమర్శించారు. 
 
"25 మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్నారు. ఇప్పుడు 28 మంది ఎంపీలున్నా నోరు తెరవకపోవడాన్ని ప్రజలే నిలదీయాలి. రివర్స్ టెండర్లతో పోలవరాన్ని జగన్ రివర్స్ చేశారు. ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు ఇస్తామని ముంపు బాధితులను నమ్మించారు. 
 
ఇప్పుడు ఆర్ అండ్ ఆర్ ఇవ్వకపోయినా ఫర్వాలేదంటున్నారు. పోలవరం ఎత్తు తగ్గించినా ఫర్వాలేదని అనడం జగన్ నమ్మకద్రోహం. 25 ఏళ్లకు పీపీఏలు కుదుర్చుకుంటే విమర్శించి, 30 ఏళ్లకు కుదుర్చుకోవడం మరో మోసం. దొడ్డిదారిన విద్యుత్ బిల్లులు పెంచి ప్రజలపై భారం మోపారు" అంటూ చంద్రబాబు మండిపడ్డారు.