శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 13 ఆగస్టు 2020 (16:17 IST)

తెదేపా సీనియర్ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడికి కరోనా పాజిటివ్!

తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి కె అచ్చెన్నాయుడికి కరోనా వైరస్ సోకింది. బుధవారం ఉదయం నుంచి ఆయనకు జలుబు చేయడంతో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయించారు. ఈ పరీక్షా ఫలితాల్లో ఆయనకు పాజిటివ్ అని వచ్చింది. దీంతో హైకోర్టుకు లేఖ రాయాలని ఏపీ సర్కారు ఉంది. 
 
ప్రస్తుతం అచ్చెన్నాయుడు జ్యూడిషియల్ రిమాండ్‌లో ఉన్న విషయం తెల్సిందే. ఈఎస్ఐ ఆస్పత్రులకు మందులు కొనుగోలు, ఇతర వైద్య పరికరాల కొనుగోలులో రూ.10 కోట్ల మేరకు అవినీతి జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ కేసును విచారిస్తూ వచ్చిన ఏసీబీ అధికారులు అచ్చెన్నాయుడిని అరెస్టు చేశారు. పైల్స్ ఆపరేషన్ చేయించుకుని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న అచ్చెన్నాయుడిని బలవంతంగా అరెస్టు చేసి శ్రీకాకుళం నుంచి రోడ్డు మార్గంలో విజయవాడకు తరలించారు. దీంతో ఆయనకు రక్తస్రావమైంది. 
 
ఈ అంశంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ తర్వాత అచ్చెన్నాయుడు ఆస్పత్రిలో చికిత్స చేయాల్సిందిగా ఆదేశాలు జారీచేసింది. ఫలితంగా ప్రస్తుతం ఆయన రమేష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పైగా, ప్రతివారం అచ్చెన్న ఆరోగ్య పరిస్థితిని హైకోర్టు ప్రభుత్వం అఫిడవిట్ రూపంలో తెలుపుతూ వస్తోంది. ఈ క్రమంలో అచ్చెన్నాయుడుకి జరిపిన కరోనా పరీక్షల్లో పాజిటివ్ అని తేలడంతో ఈ విషయాన్ని కూడా కోర్టుకు తెలపాలని అధికారులు భావిస్తున్నారు.