గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 29 జులై 2020 (12:30 IST)

ఈఎస్ఐ స్కామ్‌లో అచ్చెన్నాయుడుకి మరోమారు చుక్కెదురు!

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే, మాజీ మంత్రి కె. అచ్చెన్నాయుడికి మరోమారు చుక్కెదురైంది. ఈఎస్ఐ స్కాంలో ఆయన్ను ఏపీ ఏసీబీ పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఏసీబీ కోర్టు ఆదేశం మేరకు ఆయన్ను జైలుకు తరలించారు. అయితే, తనకు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్‌ను విచారించిన హైకోర్టు కొట్టివేసింది. అలాగే, ఈ కేసులో సంబంధం ఉన్న ఇతరులు వేసుకున్న అన్ని బెయిల్‌ పిటిషన్‌లను కూడా కొట్టేసింది. బెయిల్‌ పిటిషన్లు వేసుకున్న వారిలో రమేశ్ కుమార్, మురళీ, సుబ్బారావు కూడా ఉన్నారు.
 
కాగా, అచ్చెన్నాయుడు ఏపీ మంత్రిగా పనిచేసిన సమయంలో మందులు, సంబంధిత పరికరాల కొనుగోళ్లలో అవకతవకలకు, అవినీతికి పాల్పడినట్లు అభియోగాలు నమోదైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గతంలోనూ తనకు బెయిల్‌ మంజూరు చేయాలని పిటిషన్లు పెట్టుకోగా కింది కోర్టు వాటిని అప్పట్లోనే కొట్టివేసింది. దీంతో ఆయన బెయిలు కోసం మరికొంత కాలం ఆగుతారా లేక సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారా అన్నది తేలాల్సివుంది.