ఈఎస్ఐ స్కామ్ : ఖైదీ నంబర్ 1573 ఆస్పత్రిలో ఏం చేస్తున్నారు?
ఈఎస్ఐ స్కామ్‌లో అరెస్టు అయిన మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత కె. అచ్చెన్నాయుడుకు జైలు అధికారలు ఓ నంబరును కేటాయించారు. అది ఖైదీ నంబర్ 1573గా ఉంది. ప్రస్తుతం ఈయన అనారోగ్యంగా ఉండటంతో గుంటూరు జనరల్ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.
అంతకుముందు ఈయనను ఏపీ ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఏపీ ఏసీబీ కోర్టులో హాజరుపరచగా, 14 రోజుల రిమాండ్‌కు న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో రిమాండ్ ఖైదీగా జైలుకు తరలించగా, ఆయనకు జైలు అధికారులు 1573 అనే నంబరును కేటాయించారు.
కాగా, అచ్చెన్నాయుడు మంత్రిగా ఉన్న సమయంలో అధికారాన్ని దుర్వినియోగం చేశారని ఏసీబీ పేర్కొంది. ప్రస్తుతం ఆయనకు గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్‌లోని పొదిలి ప్రసాద్ బ్లాక్‌లో ఉన్న తొలి అంతస్తులోని ప్రత్యేక గదిలో వైద్య చికిత్సను అందిస్తున్నారు.
ఇటీవల ఆయనకు మొలల ఆపరేషన్ జరుగగా, ఆ ప్రాంతంలో ఇన్ఫెక్షన్ ఏర్పడినట్టు తెలుస్తోంది. రక్తస్రావం అవుతూ ఉండటంతో, వైద్యులు యాంటీ బయాటిక్స్ ఇస్తున్నారు. రక్తస్రావం తగ్గకుంటే మళ్లీ ఆపరేషన్ చేస్తామని వైద్యులు అంటున్నారు.
ఈ కేసులో అచ్చెన్నాయుడు ఏ2గా ఉండగ్, ఏ1గా రమేష్ కుమార్ ఉన్న విషయం తెల్సిందే. అలాగే, మరో ఐదు మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇంకొందరిని అరెస్టు చేసే అవకాశాలు ఉన్నట్టు సమాచారం.