సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 13 జూన్ 2020 (16:12 IST)

అచ్చెన్నపై ఐపీసీ 409, 420, 120 (బి) సెక్షన్ల కింద కేసు

ఈఎస్ఐ స్కామ్‌లో అరెస్టు అయిన టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుపై ఏపీ ఏసీబీ అధికారులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అందులో 409, 420, 120 (బి) సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ స్కామ్‌లో రెండో నిందితుడుగా అచ్చెన్నను అరెస్టు చేసిన ఏసీబీ... ఆ తర్వాత ఏసీబీ కోర్టులో హాజరుపరచగా, 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ రిమాండ్ రిపోర్టులో ఉన్న వివరాలను పరిశీలిస్తే, 
 
'నిబంధనలను పాటించకుండానే టెలీ హెల్త్ సర్వీసులకు కాంట్రాక్టులు ఇచ్చారు. దీనికి ఆర్థిక శాఖ అనుమతి కూడా తీసుకోలేదు. బడ్జెట్ ఆమోదం కూడా లేదు. కాంట్రాక్టు ఇచ్చిన సంస్థకు గత అనుభవం కూడా లేదు. టెండర్లను పిలవకపోవడానికి గల కారణాలను కూడా చూపలేదు. టెలీ హెల్త్ సర్వీసులకు కాంట్రాక్టులు ఇవ్వాలని అచ్చెన్నాయుడు మూడు సార్లు ఒత్తిడి చేశారు. ఆయన ఒత్తిడి మేరకే కాంట్రాక్టులు ఇచ్చారు.
 
అచ్చెన్నాయుడు ఆదేశాల మేరకు రూ.4.15 కోట్లను విడుదల చేశామని ఈఎస్ఐ డైరెక్టర్ డాక్టర్ రమేశ్ కుమార్ తెలిపారు. అచ్చెన్నాయుడుకు చాలా పలుకుబడి ఉంది. ఈ కేసులో చాలా మందిని విచారించాల్సి ఉంది. సాక్ష్యాలను, డాక్యుమెంట్లను సేకరించాల్సి ఉంది.
 
కేసులో మొదటి నిందితుడు డాక్టర్ రమేశ్, రెండో నిందితుడు అచ్చెన్నాయుడు, మూడో నిందితుడు టెలీహెల్త్ సర్వీసెస్ డైరెక్టర్ ప్రమోద్ రెడ్డి. వీరికి జ్యుడీషియల్ రిమాండ్ విధించాలి. అచ్చెన్నాయుడుపై ఐపీసీ 409, 420, 120 (బి) సెక్షన్ల కింద కేసు నమోదైంది' అని పేర్కొన్నారు.