బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 12 జూన్ 2020 (13:19 IST)

ఇది ట్రైలర్ మాత్రమే... సినిమా ముందు ఉంది.. ఎమ్మెల్యే ఆర్కే రోజా

ఈఎస్ఐ స్కామ్‍లో టీడీపీకి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి కె. అచ్చెన్నాయుడిని ఏపీ ఏసీబీ అధికారులు శుక్రవారం ఉదయం అరెస్టు చేశారు. ఆయనతో పాటు.. మరికొందరిని అదుపులోకి తీసుకుని ఆ తర్వాత వారిని అరెస్టు చేశారు. 
 
ఈ అరెస్టుపై వైకాపా ఎమ్మెల్యే ఆర్కే రోజా స్పందించారు. ఇది కేవలం ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా ముందు ఉంది అంటూ హెచ్చరించారు. పైగా, అచ్చెన్నాయుడుకి ఒళ్లు పెరిగిందేకానీ, బుద్ధి పెరగలేదంటూ విమర్శలు గుప్పించారు. 
 
ఈఎస్ఐ స్కామ్‌లో అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారన్న విషయాన్ని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గ్రహించాలన్నారు. ఎందుకంటే.. ఆయనకు అరెస్టుకు, కిడ్నాప్‌కు గల తేడాను తెలుసుకోవాలన్నారు. 
 
అంతేకాకుండా, చంద్రబాబుతో పాటు ఆయన కుమారుడు నారా లోకేశ్ కూడా జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని రోజా సూచించారు. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసిన ఓ ఒక్క ప్రజా ప్రతినిధిని వైకాపా ప్రభుత్వం వదిలిపెట్టబోదని ఎమ్మెల్యే రోజా హెచ్చరించారు.