బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 13 జూన్ 2020 (13:40 IST)

అచ్చెన్న అరెస్టు తొలి అడుగు మాత్రమే : సజ్జల రామకృష్ణారెడ్డి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రవ్వంత అవినీతిని కూడా ప్రోత్సహించబోమని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. పైగా, ఈఎస్ఐ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు అరెస్టు అవినీతిపై జగన్ సర్కారు వేసిన తొలి అడుగు మాత్రమేనని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. 
 
'గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని ప్రస్తావిస్తున్నప్పుడు దమ్ముంటే విచారణ చేయమని, చేతనైతే కేసులుపెట్టాలని చంద్రబాబు మాట్లాడతారు. ఈఎస్‌ఐ కుంభకోణంలో పక్కా ఆధారాలతో అచ్చెన్నాయుడిపై ఏసీబీ దర్యాప్తు చేస్తుంటే మాత్రం రాజకీయ కక్ష అంటున్నారు, బీసీ రంగులు అద్దుతున్నారు. 
 
రివర్స్‌ టెండరింగ్‌తో రూ.2200 కోట్లు ఆదా ద్వారా అప్పట్లో ఎంతటి అవినీతికి పాల్పడ్డారో బయటపెట్టాక చర్యలు తీసుకోవడంలో తప్పేముంది! అచ్చెన్నాయుడు అరెస్ట్, అవినీతి చర్యలపై ప్రభుత్వం తొలి అడుగు మాత్రమే'అని ట్వీట్‌ చేశారు. 
 
ఈఎస్ఐ స్కామ్‌లో ఏడుగురు అరెస్టు 
ఈఎస్‌ఐ కేసులో మొత్తం ఏడుగురిని అరెస్టు చేశామని అవినీతి నిరోధక శాఖ జేడీ రవికుమార్ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దర్యాప్తులో మరిన్ని విషయాలు బయటపడతాయన్నారు. ఈఎస్‌ఐ మందుల కొనుగోళ్ల వ్యవహారంలో వీరు ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించామని చెప్పారు.
 
హైకోర్టులో అచ్చెన్నాయుడితో పాటు రమేశ్ కుమార్ హౌస్‌ మోషన్‌ దాఖలు చేసినట్లు తమకు తెలిసిందని రవికుమార్ తెలిపారు. తాము కూడా న్యాయప్రకారం ముందుకు వెళ్తామన్నారు. దాదాపు 150 కోట్ల రూపాయల కుంభకోణం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నట్లు వివరించారు.
 
పలు అంశాల్లో ప్రభుత్వానికి నష్టం జరిగినట్లు గుర్తించామన్నారు. ప్రభుత్వ అధికారులతో ప్రైవేటు వ్యక్తులు కుమ్మక్కై ప్రభుత్వానికి నష్టాన్ని తీసుకొచ్చారని ఆయన తెలిపారు. ఇందులో 19 మంది ప్రమేయం ఉన్నట్లు తాము ఇప్పటివరకు గుర్తించామని వివరించారు.
 
రమేశ్‌కుమార్‌తో పాటు అచ్చెన్నాయుడిని న్యాయమూర్తి ముందు హాజరుపర్చామని తెలిపారు. శనివారం మరో ఐదుగురిని న్యాయమూర్తి ముందు హాజరుపర్చుతున్నామని వివరించారు. ఈ కేసులో విచారణ కొనసాగుతుందని చెప్పారు.