శనివారం, 22 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 7 ఏప్రియల్ 2017 (08:56 IST)

జగన్ ఢిల్లీ యాత్రకొచ్చారు... రాష్ట్రపతి ఏం చేస్తారు.. కాసిని కాఫీ ఇస్తారు : జేసీ దివాకర్ రెడ్డి

వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ యాత్రకు వచ్చారు. 'కష్టాలు వచ్చినప్పుడే దేవుడి దర్శనానికి వెళతాం.. అలాగే జగన్‌కు సమస్యలు వచ్చినప్పుడే ఢిల్లీ వస్తాడు', ఇది ఆయనకు సహజమే అంటూ జేసీ వ్యంగ్యాస్త్రాలు

వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ యాత్రకు వచ్చారు. 'కష్టాలు వచ్చినప్పుడే దేవుడి దర్శనానికి వెళతాం.. అలాగే జగన్‌కు సమస్యలు వచ్చినప్పుడే ఢిల్లీ వస్తాడు', ఇది ఆయనకు సహజమే అంటూ జేసీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 
 
సహచర ఎంపీలతో కలిసి గురువారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ), సీబీఐ నుంచి తాఖీదులు రాగానే... జగన్ ఢిల్లీ యాత్ర చేపడతారని, అన్ని పాపాలూ పోతాయనే ఆయన ఇక్కడకు వస్తుంటారన్నారు. 
 
‘రాష్ట్రపతిని కలిస్తే ఆయనేం చేస్తారు? కప్పు కాఫీ ఇచ్చి, పరిశీలిస్తామని సమాధానమివ్వడం తప్ప మరేమీ లభించదు. ప్రధానమంత్రిదే అసలైన పాత్ర. అనవసరంగా విమాన టికెట్లకు డబ్బులు వృధా చేయకుండా రామ్‌జెఠ్మలానీ వంటి లాయర్లను పెట్టుకుని ఆ మార్గంలో చూసుకోవాలి. 
 
ఈ మధ్యనే మరొక సూట్‌కేస్‌ వ్యవహారం బయటపడింది. కాబట్టి ఇక లాభం లేదురా నాయనా’ అని జేసీ తనదైన శైలిలో జగన్‌కు హితవు పలికారు. ‘కాలం మారుతోంది. పద్ధతులు మారుతున్నాయి. చంద్రబాబు మాత్రం మారనంటూ వ్యతిరేకంగా పోతే కొట్టుకుపోతారు. అయినా ఆయనేమీ వైసీపీ ఎమ్మెల్యేలను పిలవలేదు. జగన్ మూర్ఖత్వాన్ని సహించలేక, ఆయన నాయకత్వంపై నమ్మకం లేక విసిగి వేసారి దగ్గరి బంధువులతో సహా వారు పార్టీని వీడుతున్నారు’ అని తెలిపారు. 
 
ఈసారితో చంద్రబాబు 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసినట్లు అవుతుందని, ఇక ఆయనకు మళ్లీ సీఎం కావాలన్న ఆశ ఉండదని జేసీ అన్నారు. అయితే.. ప్రజలు తమ అవసరాలను తీర్చుకునేందుకైనా ఆయన్ను తిరిగి సీఎంను చేయాలని పిలుపిచ్చారు. 2018లోపు పోలవరాన్ని పూర్తి చేస్తానని బాబు అంటున్నారని, కనీసం ఐదేళ్లయినా పడుతుందన్నారు. పట్టిసీమ కారణంగానే అనంతపురం లో నీళ్లు తాగుతున్నామని, కేసీ కెనాల్‌ కింద పంటలు పండుతున్నాయన్నారు.