తినేది బీజేపీ కూడా.. పాడేది వైకాపా పాట : జీవీఎల్‌పై వర్ల విసుర్లు
భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహా రావుపై తెలుగుదేశం పార్టీ నేత వర్ల రామయ్య తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. జీవీఎల్.. తినేది బీజేపీ కూడు... పాడేది వైకాపా పాట అంటూ ఆరోపించారు.
మూడు రాజధానులు ఉంటే తప్పేంటన్న జీవీఎల్ వ్యాఖ్యలకు వర్ల రామయ్య శుక్రవారం కౌంటరిచ్చారు. ఏపీ బీజేపీ వ్యవహారాల్లో జీవీఎల్ ఎందుకు జోక్యం చేసుకుంటున్నారని నిలదీశారు. జీవీఎల్ వైసీపీకి అనుకూలంగా మాట్లాడటంలో మతలబు ఏంటి? అని అన్నారు. జగన్‌ను జీవీఎల్ ఏకాంతంగా ఎందుకు కలిశారని సూటింగా ప్రశ్నించారు. రాష్ట్ర బీజేపీ శాఖకు తెలియకుండా జగన్‌ను కలవడంపై సమాధానం చెప్పాలని వర్ల డిమాండ్ చేశారు.
ఇటీవల ఢిల్లీలోని లోథి హోటల్‌లో వైసీపీ ముఖ్య నేతను జీవీఎల్ ఎందుకు కలిశారని ప్రశ్నించారు. మూడు రాజధానులపై జీవీఎల్ కారుకూతలు కూయడం మానుకోవాలంటూ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. జీవీఎల్‌కు ధైర్యముంటే రాజధానిలో పర్యటించాలని సవాల్ విసిరారు.
తినేదే బీజేపీ కూడు.. పాడేది వైసీపీ పాట అంటూ ధ్వజమెత్తారు. ఏపీ రాజధానిగా అమరావతి అంటూ బీజేపీ రాష్ట్ర శాఖ తీర్మానం చేసిన విషయం గుర్తు లేదా అని వర్ల రామయ్య నిలదీశారు. అలాంటపుడు మూడు రాజధానులు ఉంటే తప్పేంటని ఎలా అడుగుతారంటూ వర్ల ప్రశ్నించారు.