మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , బుధవారం, 25 ఆగస్టు 2021 (10:23 IST)

ర‌మ్య కేసు ఒక్క‌టే అభినంద‌నీయం... మిగ‌తావి అన్నీ....

జాతీయ ఎస్సీ క‌మిష‌న్ సభ్యుల ఏపీ ప‌ర్య‌ట‌న ఇపుడు వివాదాస్ప‌దం అవుతోంది. వారు గుంటూరులో ప‌ర్య‌టించి, ర‌మ్య హ‌త్య కేసు ఒక్క‌టే ప‌రిశీల‌న చేసి, రాష్ట్ర ప్ర‌భుత్వానికి కితాబు ఇవ్వ‌డంపై ప్ర‌తిప‌క్షాలు అస‌హ‌నాన్ని వ్య‌క్తం చేస్తున్నాయి. మ‌రో ప‌క్క ద‌ళిత సంఘాలు కూడా దీనిని త‌ప్పుప‌డుతున్నాయి. 
 
ఢిల్లీ నుంచి ఆఘ‌మేఘాల‌పై గుంటూరుకు వ‌చ్చిన జాతీయ ఎస్సీ క‌మిష‌న్, బీటెక్ విద్యార్థిని ర‌మ్య హ‌త్య కేసుపై ప్రాథ‌మిక విచార‌ణ జ‌రిపింది. ర‌మ్య హ‌త్య జ‌రిగిన స్థలాన్ని కూడా ప‌రిశీలించింది. ఇక డిజిపితో స‌హా పోలీస్ ఉన్న‌తాధికారులంద‌రినీ క‌లిసింది. గ‌న్న‌వ‌రం ఎయిర్ పోర్ట్ లోనే టిడిపి, ఇత‌ర దళిత సంఘాల వారు జాతీయ ఎస్సీ క‌మిష‌న్ ఎదుట హంగామా చేశారు. చివ‌రికి వారికి కూడా అప్పాయింట్ మెంట్ ఇచ్చి గుంటూరులో క‌లిశారు. ఆఖ‌రుకు క‌మిష‌న్ సిఎం జ‌గ‌న్ ను తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో క‌లిశారు. అక్క‌డ డిజిపి, ఇత‌ర అధికారుల‌తో సంభాషించి, ర‌మ్య కేసులో ఏపీ ప్ర‌భుత్వం స‌త్వ‌రం స్పందించింద‌ని కితాబు ఇచ్చారు. 
 
దీనితో ప్ర‌తిప‌క్షాల‌కు ముఖ్యంగా ద‌ళిత సంఘాల వారికి ఇర‌కాట ప‌రిస్థితి ఏర్ప‌డింది. రాష్ట్రంలో ద‌ళితుల‌పై ద‌మ‌న కాండ జ‌రుగుతోంద‌ని వారు మొత్తుకుంటున్నారు. చివ‌రికి టిడిపి నాయ‌కుడు వ‌ర్ల రామయ్య ఆధ్వ‌ర్యంలో టిడిపి బృందం ఎస్.సి. క‌మిష‌న్ ను క‌లిసింది. రమ్య హత్య ఘటన, రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడుల వివరాలను ఎస్సి కమిషన్ సభ్యులకు టీడీపీ నేతలు వివ‌రించారు. అనంత‌రం వర్ల రామయ్య మాట్లాడుతూ, దళితులపై జరిగిన దాడులకు సంబంధించి జాతీయ ఎస్సి కమిషన్ కు ఒక బుక్ లెట్ అందించామ‌న్నారు. రమ్య కేసులో మాత్రమే తాము ప్రభుత్వాన్ని అభినందించామ‌ని ఎస్సి కమిషన్ సభ్యులు మాతో అన్నార‌ని వ‌ర్ల వివ‌రించారు.
 
తాము ఇచ్చిన అధారాలను ఎస్సి కమిషన్ పరిశీలించింద‌ని, త్వరలో ఢిల్లీ పిలుస్తాము అని ఎస్సి కమిషన్ సభ్యులు చెప్పార‌ని పేర్కొన్నారు. అవసరం అయితే ప్రతి కేసులో డిజిపి వివరణ కోర‌తామ‌ని అన్నార‌ని వివ‌రించారు. 
 
మాజీ మంత్రి న‌క్కా ఆనంద్ బాబు మాట్లాడుతూ, తాము ఇచ్చిన ఫిర్యాదులపై ఎస్సి కమిషన్ చర్యలు తీసుకుంటామ‌ని హామీ ఇచ్చింద‌న్నారు. రెండున్నర ఏళ్లలో దళితులే టార్గెట్ గా దాడులు చేశార‌ని  కమిషన్ కి చెప్పామ‌ని, డాక్టర్ సుధాకర్ ని పిచ్చి వాడిగా చేసి ఆయన మరణానికి ప్రభుత్వమే కారణం అయింది అని జాతీయ కమిషన్ దృష్టికి తీసుకువెళ్లామ‌న్నారు. 
 
మాజీ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ, టీడీపీ నేతలు ఎస్సి కమిషన్ దగ్గరికి వెళ్తున్నారు అనగానే,  అక్క‌డికి వైసీపీ నేతలను పంపిస్తున్నార‌ని, ఒక భయానక వాతావరణాన్ని ప్రభుత్వమే సృష్టిస్తోంద‌ని వివ‌రించారు.