సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వాసు
Last Updated : బుధవారం, 20 మార్చి 2019 (15:06 IST)

ఎవడి గోల వాడిది... ఎన్నికల ఖర్చు కోసం భిక్షాటన

ఎన్నికలు ఖరీదైపోయాయని పేర్కొంటూ, ఎన్నికల ఖర్చుల కోసం ఓ అభ్యర్థి భిక్షాటన చేస్తూండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ వివరాలను పరిశీలిస్తే, అంబర్‌పేటకు చెందిన కె.వెంకటనారాయణ అనే సామాజిక కార్యకర్త... సికింద్రాబాద్‌ నియోజకవర్గం నుండి ఎంపీగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. కాగా... ఎన్నికల ఖర్చుల కోసం రుణం ఇవ్వాలని బ్యాంకుల చుట్టూ తిరిగినా, ఫలితం దక్కలేదు. చివరకు రాష్ట్రపతికి ఫ్యాక్స్‌ ద్వారా వినతి పత్రం కూడా పంపించాడు. అయినప్పటికీ ఫలితం కనబడకపోవడంతో ‘ఓటు + నోటు.. ఓటు అమ్ముకోకండి’ అనే నినాదంతో మంగళవారం భిక్షాటనకు శ్రీకారం చుట్టాడు.
 
ఈ సందర్భంగా వెంకటనారాయణ మాట్లాడుతూ... ఎన్నికల వ్యయం కోసం రుణం మంజూరు చేయవలసిందిగా కోరుతూ పలు బ్యాంకులలో దరఖాస్తులు అందజేసానీ, అయితే ఆర్‌బీఐ నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికల కోసం రుణం ఇవ్వలేమని అధికారులు చెప్పడంతో... భిక్షాటన చేస్తున్నాననీ పేర్కొన్నారు. సికింద్రాబాద్‌ నియోజకవర్గంలోని అన్ని కాలనీలు, బస్తీల్లో భిక్షాటన చేస్తానని ఆయన చెప్పుకొచ్చారు. ఈ ఎన్నికలు అయ్యేలోపు ఇంకా ఎటువంటి అభ్యర్థులు తెర మీదకు రానున్నారో కానీ... ఒక్కొక్కరి దారి ఒక్కో విధంగా ఉంటోంది.