సీఎం పదవిని కించపరిచిన వారిని ఏ చెప్పుతో కొట్టాలి : భట్టి విక్రమార్క
తనకు ముఖ్యమంత్రి పదవి ఎడమకాలి చెప్పుతో సమానమంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్రంగా ఖండించారు. ఇదే విషయంపై ఆయన మాట్లాడుతూ, "గౌరవప్రదమైన, రాజ్యాంగబద్ధమైన ముఖ్యమంత్రి పదవిని ఎడమ కాలి చెప్పుతో సమానమని కించపరిచిన నిన్ను (కేసీఆర్) ఏ చెప్పుతో కొట్టాలి" అంటూ సూటిగా ప్రశ్నించారు.
ఆదిలాబాద్ జిల్లా రూరల్ మండలం భీంసారి గ్రామంలో రైతులతో ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సీఎం పదవిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసీఆర్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వాలు చేసే చట్టాలు ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలే తప్ప వ్యతిరేకంగా కాదన్నారు. కేంద్రం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎత్తివేస్తే సహించబోమన్నారు.
దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు 70 రోజులుగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నా కేంద్రం పట్టించుకోకపోవడం దారుణమని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఆదానీ, అంబానీలు నడిపిస్తుంటే రాష్ట్రాన్ని మెగా కృష్ణారెడ్డి, రాజేశ్వర్‌రావులు నడిపిస్తున్నారని మరో కాంగ్రెస్ నేత శ్రీధర్ బాబు ఆరోపించారు.