శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 8 ఫిబ్రవరి 2021 (19:28 IST)

కేసీఆర్ గారూ.. ఇన్ని తిట్లు, శాపనార్థాలు ఎందుకో?: రాములమ్మ ఫైర్

సీఎం కేసీఆర్‌పై బీజేపీ నేత విజయశాంతి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. విలీనం పేరుతో ప్రాంతీయ పార్టీలను లేకుండా చేశారని మండిపడ్డారు. "టీఆరెస్ తప్ప మిగతా ప్రాంతీయ పార్టీలు దెబ్బతిన్నాయని కేసీఆర్ గారు అన్నట్టు వార్తలు వచ్చాయి. అయితే, ఇతర ప్రాంతీయ పార్టీలు మనుగడ సాగించకుండా కోవర్టు ఆపరేషన్లతో, కుట్రలతో అబద్ధపు దుష్ప్రచారాలతో ఎన్నో దుర్మార్గాలు చేశారు. 
 
ఆ తర్వాత చర్చలని చెప్పి ఆ పార్టీలను తెలంగాణ ఐక్యత పేరుతో విలీనం చేయించి, ఆ పార్టీలు లేకుండా చేసిన ఘనత కేసీఆర్ గారిదే... తన కుర్చీ కుమారుడికి మారుతుందని అన్నందుకే... ఎమ్మెల్యేలు, మంత్రుల స్థాయి నేతలను బండకేసి కొడతానని... పార్టీ నుండి ఊడపీకుతానని ఎగిరి, దుమికి తిట్టబట్టిన కేసీఆర్ గారు... తన సీఎం పదవి ఎడమ కాలి చెప్పుతో సమానం అని చెప్పడం విడ్డూరం. 
 
అంత లెక్కలేని దానికి ఇన్ని తిట్లు, శాపనార్థాలు ఎందుకో? సీఎం పదవి గురించి మాట్లాడితే ఇంత ఆగం అవుతున్న కేసీఆర్ గారు, అయోధ్య గురించి, రిజర్వేషన్ ఉద్యోగుల గురించి అవమానకరంగా వ్యాఖ్యలు చేసిన టీఆరెఎస్ ఎమ్మెల్యేలపై కనీసం ఖండన చెయ్యకపోవడం గమనార్హం." అంటూ విజయశాంతి నిప్పులు చెరిగారు.