ట్రాఫిక్ ఖాకీని చెప్పుతో కొట్టిన తెరాస మహిళా నేత
తెలంగాణ రాష్ట్రంలో ట్రాఫిక్ మహిళా కానిస్టేబుల్‌ని చెప్పుతో కొట్టింది తెరాస మహిళా నేత. సిర్పూర్ కాగజ్ నగర్ ఫారెస్ట్ అధికారిపై దాడి సంఘటన మరువకముందే మల్కాజిగిరిలో మరో అధికారిపై తెరాస నాయకురాలు దాడికి పాల్పడింది. ద్విచక్ర వాహనంపై ముగ్గురు వెళ్తున్నారని ఫోటో తీసినందుకు ట్రాఫిక్ కానిస్టేబుల్‌ని చెప్పుతో కొట్టింది.
మల్కాజిగిరి మౌలాలికి కమాన్ వద్ద ముజఫర్ అనే ట్రాఫిక్ కానిస్టేబుల్ విధి నిర్వహణలో ఉన్నాడు. గౌస్ అనే వ్యక్తి మరో ఇద్దరుతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళుతుండగా ముజఫర్ ఫోటో తీశాడు. అది గమనించిన గౌస్ కానిస్టేబుల్‌ని బెదిరించి వెళ్లాడు. 15 నిమిషాల తర్వాత మరో నలుగురు వచ్చి కానిస్టేబుల్ ముజఫర్‌పై మౌలాలికి చెందిన టి.ఆర్.ఎస్ నాయకురాలు దాడి చేశారు.
ఆమె పేరు సయ్యద్ మహమ్ముదా బేగం. ఆమె కానిస్టేబుల్‌ను చెప్పుతో కొట్టింది. ఆ తర్వాత ఆమె వెంట వచ్చినవారితో పాటు కుటుంబ సభ్యులు కూడా దాడి చేశారు. కానిస్టేబుల్ వద్ద ఉన్న కెమెరా కూడా లాక్కున్నారు. తనపై జరిగిన దాడిపై ట్రాఫిక్ కానిస్టేబుల్ ముజఫర్ మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాడి చేసిన ఐదుగురిపై ఐపీసీ 332, 382, 506 ఐపీసీ ప్రకారం కేసు నమోదు చేసి మల్కాజిగిరి పోలీసులు వారిని అరెస్టు చేశారు.