బుధవారం, 20 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 18 జులై 2019 (11:00 IST)

పాము కాటు.. ఆస్పత్రిలోనే నగ్నంగా మహిళ.. తాంత్రిక పూజలు..

టెక్నాలజీ ఎంత పెరిగినా.. మూఢ నమ్మకాలపై ప్రజలకు ఇంకా నమ్మకం తరగలేదు. ఇందుకు ఈ ఘటనే నిదర్శనం. మధ్యప్రదేశ్‌‌లో ఓ యువతి పాము కాటుకు గురికాగా, ఆసుపత్రిలో చేరిన ఆమెకు నయం చేయాలంటే భూత వైద్యుడు రావాల్సిందేనని చెప్పి, ఓ మంత్రగాడిని కుటుంబ సభ్యులు పిలిపించారు. డాక్టర్ల వైద్యం వద్దంటూ, ఆసుపత్రి ఆవరణలోనే తాంత్రిక పూజలు చేశారు.
 
విషం పోవాలంటే, నగ్నంగా ఉండాలంటూ, ఆమె ఒంటిపై దుస్తులు ఊడదీసి అవమానించారు. ఈ ఘటనను అక్కడే ఉన్న ఆసుపత్రి సిబ్బంది చూస్తూనే ఉన్నా, ఏమీ చేయలేని పరిస్థితి. ఇందుకు సంబంధించిన సీసీటీవీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. దామో జిల్లాలోని భతియాగర్ గ్రామానికి చెందిన ఇమ్రాత్ దేవి (25)ని పాము కరువగా, చికిత్స కోసం ఆమె దామో ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. 
 
మహిళా వార్డులో ఆమె చికిత్స పొందుతుండగా, బంధువులు ఓ మంత్రగాడిని తెచ్చి వైద్యం చేయించే ప్రయత్నం చేశారు. ఆపై ఆమె చేత పురుషుల వార్డు బయట బట్టలు విప్పించారు. మంత్రగాడు కొన్ని మంత్రాలు చదువుతూ తన పని తాను చేసుకుపోయాడు. దీనిపై ఉన్నతాధికారులు మాట్లాడుతూ, ఓ నర్సు ఈ ఘటనను చూసిందని, కానీ ఆమె డాక్టర్లకు, సెక్యూరిటీ గార్డుకి సమాచారమివ్వలేదని చెప్పారు. మూఢ నమ్మకాలపై ఎంత చెప్పినా ఇంకా కొందరు మారట్లేదని నర్సు వాపోయారు.