సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 16 జులై 2019 (10:30 IST)

తిరుమలలో భక్తురాలిపై ఎలుగుబంటి దాడి...

తిరుమలలో భక్తురాలిపై ఎలుగుబంటి దాడి జరిగింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ మహిళా భక్తురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తిరుమలగిరుల్లో వన్యప్రాణాలు అధికంగా సంచరిస్తున్న విషయం తెల్సిందే. ఇవి కొన్ని సందర్భాల్లో రక్షణ కంచెను దాటి కాలినడక శ్రీవారి దర్శనం కోసం వెళ్లే భక్తులపై దాడి చేస్తున్నాయి. ఈ తరహా ఘటనలు అధిక సంఖ్యలో పెరిగిపోతున్నాయి. 
 
తాజాగా తిరుమలకు వచ్చిన ఓ యువతి, గోగర్భం డ్యామ్‌లో స్నానం చేసి వస్తుండగా, ఎలుగుబంటి దాడి చేసింది. ఆ భక్తురాలిని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన విజయలక్ష్మి (26)గా గుర్తించారు. హైదరాబాద్‌లో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతోంది. ఆమె తల్లి పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తోంది. హైదరాబాద్‌లో తన అవసరాలకు తగినంత డబ్బులను తల్లి ఇవ్వడం లేదని అలిగిన విజయలక్ష్మి గత శుక్రవారం తిరుమలకు చేరుకుని, అప్పటి నుంచి అక్కడే ఉంటోంది. 
 
ఈ క్రమంలో సోమవారం గోగర్భం డ్యామ్ వద్దకు వెళ్లిన ఆమె, స్నానానంతరం అడవి వైపు వెళ్లగా, అక్కడే కాచుకుకూర్చున్న ఎలుగు దాడి చేసింది. ఈ ఘటనలో గాయాలపాలైన ఆమె, కేకలు వేస్తూ పరుగులు పెట్టగా, గమనించిన ఇతర భక్తులు అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆమెను స్థానిక అశ్విని ఆసుపత్రికి తరలించిన అధికారులు చికిత్సను అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటోందని డాక్టర్లు తెలిపారు.