శ్రీవారి సేవలో రాష్ట్రపతి దంపతులు... శ్రీహరికోటకు వెళ్లనున్న కోవింద్
భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఆదివారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయన తన కుటుంబ సమేతంగా శనివారం రాత్రే తిరుమలకు చేరుకుని, ఆదివారం ఉదయం ప్రారంభ దర్శన సమయంలో స్వామివారిసేవలో పాల్గొన్నారు.
అంతకుముందు.. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌తో భార్య సవితా కోవింద్, ఇతర కుటుంబీకులతో కలిసి, పద్మావతి అతిథి గృహం నుంచి తొలుత వరాహస్వామిని దర్శించుకుని, ఆపై ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, ఎంపీ విజయసాయిరెడ్డి, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులు స్వాగతం పలికారు.
ఆలయ పూజారులు ఆయనకు పట్టువస్త్రాలను అందించి, స్వాగతం పలికి ఆలయంలోకి తీసుకెళ్లి, ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం కోవింద్ కుటుంబానికి తీర్థ ప్రసాదాలు అందించి, ఆశీర్వచనం చేశారు.
రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. ఆదివారం మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో శ్రీహరికోటకు చేరుకుంటారు. అక్కడ బస చేసి సోమవారం తెల్లవారుజామున చంద్రయాన్-2 ఉపగ్రహ ప్రయోగాన్ని వీక్షించనున్నారు. ఆ తర్వాత తిరిగి రేణిగుంట విమానాశ్రయం చేరుకుని ఢిల్లీకి బయల్దేరి వెళ్లనున్నారు.
అంతకుముందు ఆయన శనివారం సాయంత్రం పద్మావతి అమ్మవారిని, కపిలేశ్వర స్వామివారిని దర్శించుకున్న విషయం తెల్సిందే.