రేవంత్ రెడ్డి అడ్డ గాడిదా?: కేటీఆర్
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు గాడిదలు అయితే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మరి అడ్డ గాడిదా? అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి దూకుడు రియల్ ఎస్టేట్ వెంచర్ లాంటిదని, మార్కెట్ చేసుకొనేందుకు హడావిడి తప్ప అంత సీన్ లేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల, బీఎస్పీ నేత ప్రవీణ్ కుమార్ జాతీయ పార్టీలకు తొత్తులని దుయ్యబట్టారు. షర్మిల, సీఎం కేసీఆర్‌పై తప్ప బీజేపీ, కాంగ్రెస్ గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. సీఎంను నోటికొచ్చినట్లు తిడితే రాజద్రోహం కేసులు పెట్టడానికి వెనకాడమని హెచ్చరించారు.
టీఆర్‌ఎస్ ఓట్లు చీల్చి జాతీయ పార్టీలకు న్యాయం చేయాలని చూస్తున్నారని, బీజేపీ, కాంగ్రెస్ అధికారంలో ఉండే రాష్ట్రాల్లో దమ్ముంటే బీసీ బంధు పెట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు నిజమైన విముక్తి రాష్ట్రం ఏర్పడటంతోనే జరిగిందని తెలిపారు. బీజేపీకి సాయుధ పోరాటం గురించి మాట్లాడే హక్కు లేదని, ఆనాడు సాయుధ పోరాటం చేసింది కమ్యునిస్టులేనని కేటీఆర్ గుర్తు చేశారు.