సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (20:53 IST)

రాష్ట్రాల ఆదాయాన్ని తినేస్తున్న జిఎస్టి: మంత్రి బుగ్గన

జిఎస్టి ప్రవేశ పెట్టక పూర్వం వార్షిక వృద్ది 17 శాతం వరకు ఉండగా, ఇప్పుడు అందుకు భిన్నమైన పరిస్ధితులు నెలకొన్నాయని ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన లక్నోలో శుక్రవారం జరిగిన 45వ జిఎస్‌టి కౌన్సిల్ సమావేశంలో మంత్రి బుగ్గన పలు సమస్యలను ప్రస్తావించారు.
 
రాష్ట్రం నుండి బుగ్గనతో పాటు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, డాక్టర్ రజత్ భార్గవ, రాష్ట్ర వాణిజ్య పన్నుల ప్రధాన కమిషనర్ రవిశంకర్ నారాయణ్ సుడగాని, వాణిజ్య పన్నుల శాఖ సీనియర్ అధికారులు హాజరయ్యారు.

ఈసందర్భంగా సమావేశంలో బుగ్గన మాట్లాడుతూ, రాజ్యాంగంలో పొందుపరచబడిన సమాఖ్య నిర్మాణం కింద రాష్ట్ర పన్నుల అధికారాలపై దృష్టి సారించాలన్నారు. పెట్రోల్, డీజిల్ విషయంలో జిఎస్టి పరంగా ఆంధ్రప్రదేశ్ తన పూర్వవైఖరికే కట్టుబడి ఉందని వీటిని జిఎస్టిలో కలపవలసిన అవసరం లేదన్నారు. వ్యాట్ అమలు కాలంలో రాష్ట్రం యొక్క పూర్వ ఆదాయాలతో ప్రస్తుతం వస్తున్న జిఎస్టి ఆదాయాలు ఏమాత్రం సరిపోలడం లేదన్నారు.
 
2017లో జిఎస్టి ప్రవేశపెట్టడానికి ముందు 3 సంవత్సరాల పాటు 14 నుండి 15 శాతం సగటు వార్షిక వృద్ధిని నమోదు చేయగా, జిఎస్టి ప్రవేశపెట్టిన తర్వాత గత 4 సంవత్సరాలలో దాని సగటు పెరుగుదల సుమారు 10 శాతం మాత్రమే ఉందన్నారు. ఈ క్రమంలో ప్రతి సంవత్సరం పరిహారం అందించడం తప్పనిసరన్నారు.

మరోవైపు కరోనా రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యకలాపాలను తీవ్రంగా ప్రభావితం చేసిందని, వచ్చే ఏడాది రాష్ట్ర ఆదాయాలు పుంజుకుంటాయని అంచనా వేసినా పరిస్ధితులు అందుకు అనుగుణంగా లేవని అన్నారు. ఈ నేపధ్యంలో రాష్ట్రానికి భారత ప్రభుత్వం నుండి పరిహారం రూపంలో అదనపు నిధులు తప్పనిసరని స్పష్టం చేసారు. ప్రతి సంవత్సరం 14 శాతం వృద్ధికి భరోసా ఇస్తూ, 2025 వరకు పరిహారాన్ని పొడిగించాల్సిన అవసరాన్ని బుగ్గన నొక్కిచెప్పారు.
 
నాపరాయి ఫలకాలపై పన్ను రేటు అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించిన మంత్రి పాలిష్ చేసిన ఫలకాలపై ఉన్న పన్ను రేటును 18 శాతం నుండి 5 శాతానికి పరిమితం చేయాలని సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. సౌర విద్యుత్ ప్లాంట్లు, మద్యం తయారీ కార్యకలాపాలలో జాబ్ వర్క్‌లపై పన్ను రేటును 5 శాతానికి తగ్గించాలని అభ్యర్థించారు.
 
మరోవైపు 28 శాతం జిఎస్‌టి, 12 శాతం పరిహార సెస్సును ఆకర్షించే ఏరేటెడ్ పానీయాలతో సమానంగా మసాలా నీటిని శుద్ధి చేయాలా వద్దా అన్న అంశంపై అధ్యయనం చేయాలన్నారు. ఆదాయపరంగా రాష్ట్రం ఇబ్బందులలో ఉన్నందున, 2021 ఆగస్టు వరకు ఏపీకి చెల్లించాల్సిన పరిహారాన్ని త్వరగా విడుదల చేయాలని తద్వారా సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించగలుగుతామని వివరించారు. ఈ సమావేశంలో యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు.