సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 15 సెప్టెంబరు 2021 (09:55 IST)

జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్ - డీజల్? - 17న నిర్ణయం తీసుకునేనా?

కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రత్యక్ష సమావేశాలకు స్వస్తి పలికిన జీఎస్టీ మండలి దాదాపు 20 నెలల తర్వాత ఈ నెల 17న (శుక్రవారం) ప్రత్యక్షంగా సమావేశంకాబోతోంది. 18 డిసెంబరు 2019 తర్వాతి నుంచి ఆన్‌లైన్‌లోనే ఈ సమావేశాలు జరుగుతుండగా, ఇప్పుడు తొలిసారి మండలి ప్రత్యక్షంగా సమావేశం కాబోతోంది.
 
ఈ సమావేశంలో పెట్రోలు, డీజిల్‌తోపాటు పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలన్న అంశంపై ఈ సమావేశంలో చర్చించే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. 
 
నిజానికి పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఆదాయంలో కొంత కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి ఇందుకు అవి అంగీకరిస్తేనే పెట్రోలు, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తెచ్చే వీలుంటుందని కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలు ఇప్పటికే స్పష్టం చేశాయి కూడా. 
 
అయితే, ప్రభుత్వాలకు ఆదాయం తగ్గినప్పటికీ వినియోగదారులకు మాత్రం దీనివల్ల భారీ ప్రయోజనం చేకూరుతుంది. పెట్రోలు, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడంపై జీఎస్టీ మండలి చర్చించి నిర్ణయం తీసుకోవాలని కేరళ హైకోర్టు జూన్‌లోనే మండలికి సూచించింది. 
 
అలాగే, కరోనా ఔషధాలు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు వంటి వాటికి పన్ను మినహాయింపులు కొనసాగించే అంశంపైనా జీఎస్టీ మండలి సమావేశంలో చర్చిస్తారని సమాచారం. ఈ పరిస్థితుల్లో వచ్చే శుక్రవారం జరుగనున్న జీఎస్టీ మండలి సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.