మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , బుధవారం, 12 జనవరి 2022 (17:51 IST)

మంత్రి కొడాలి నాని ఫిలిం ఎగ్జిబిట‌ర్... ఆయ‌న త‌లుచుకుంటే చాలు...

విజయవాడలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ హాలులో ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు సమావేశం అయ్యారు. సినిమా టిక్కెట్ల ధ‌ర త‌గ్గింపు వ్య‌వ‌హారంపై వీరంతా చ‌ర్చించారు. దీనిపై విజయవాడ ఎగ్జిబిటర్స్ అధ్యక్షుడు సాయి ప్రసాద్ మాట్లాడుతూ, నైట్ కర్ఫ్యూ 50 శాతం ఆక్యుపెన్సీపై చర్చించామ‌న్నారు. 50శాతం ఆక్యుపెన్సీతో సినిమా హాళ్ళ అద్దెలు, కరెంట్ బిల్లులు కూడా చెల్లించలేమ‌న్నారు.
 
కర్ఫ్యూ సమయంలో మూడు షోలు మాత్రమే వేయగలమ‌ని, కొత్త సినిమాలు కూడా రిలీజ్ కావడం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇలా అయితే డిస్ట్రిబ్యూటర్ల నుంచి సహకారం లేకపోతే థియేటర్లు నడపడం కష్టం అని తేల్చారు. నాలుగు షోలు వేయాలంటే ప్రేక్షకులు ఉదయమే థియేటర్లకు వచ్చే అవకాశం ఉండద‌న్నారు.
 
 
టికెట్ ధరలపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సెక్రెటరీ రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. 5 రూపాయలు టికెట్ అంటే చాలా మనస్తాపం కలుగుతుంద‌న్నారు. 5 రూపాయలు టికెట్ పెట్టే బదులు టీవీలో సినిమా ఫ్రీగా చూడవచ్చు కదా అన్నారు. 5 రూపాయలతో ఫ్యాన్ లు, ఏసీలు వేసి థియేటర్లు ఎలా  నడుపుతాం అని ప్ర‌శ్నించారు. చాలా మంది ఎమ్మెల్యే లకు థియేటర్లు ఉన్నాయ‌ని, సీఎం గారితో చెప్పే చనువు ఉన్నా పట్టించుకోవడం లేదన్నారు.


మంత్రి కొడాలి నాని సినిమా మనిషి, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబ్యూటర్ కూడా, కొడాలి నానికి మొత్తం తెలుసు. ఫిల్మ్ ఛాంబర్ లో ఇంకా ఆయ‌న మెంబెర్ షిప్ కొనసాగుతుంద‌ని చెప్ప్పారు.  హీరోలు మంత్రి కొడాలి నానికి బాగా క్లోజ్ అని, పేర్ని నాని గారికి కూడా థియేటర్ల గురించి అన్నీ తెలుసున‌ని అన్నారు. మంత్రి కొడాలి నాని క‌ల్పించుకుంటే, సినిమా టిక్కెట్ల వ్య‌వ‌హారం ప‌రిష్కారం అయిపోతుంద‌ని చెప్పారు. చాలా మంది నిర్మాతలు ఇపుడు అప్పులు చేసి పైకి షో చేస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.