ఫ్లాష్ న్యూస్ - జనవరి 3న నిర్మాతలకు తీపి కబురు రాబోతోంది!
తెలంగాణా, ఆంధ్రాలలో సినిమారంగానికి భిన్నమైన వైఖరి కనిపిస్తుంది. ఆంధ్రలో వై.ఎస్.జగన్ ప్రభుత్వం సినిమా టికెట్ల రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. కానీ, తెలంగాణాలో మాత్రం అగ్ర సినిమాలు కొద్దిరోజుల వరకే తమ టిక్కెట్లు పెంచుకునేలా నిర్ణయం తీసుకుంది. రెండు భిన్నమైన రూల్స్ వున్న తెలుగు సినీ పరిశ్రమకు పెద్ద సవాల్‌గా మారింది.
కాగా, ఇటీవలే ఆంధ్రలో మూసివేసిన థియేటర్లను ఓపెన్ చేసుకోవచ్చని ప్రభత్వం నిర్ణయం కూడా తీసుకుంది. ఇంకోవైపు సినిమా సమస్యలపై ఓ కమిటీని ఆంధప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే కొత్త ఏడాది వస్తుంది. సినిమా ఇండస్ట్రీకి ఏదైనా మంచి చేయాలని సీనీ పెద్దలు ఆశతో వున్నారు.
అందుకే డిసెంబర్ 31, శుక్రవారం 11 గంటలకు ఆంధ్రప్రదేశ్ ప్రభత్వ అధికారులు, పేర్నినానితోపాటు సినీ కమిటీ తో ఆన్‌లైన్ సమావేశం ఏర్పాటు చేశారు. ఇక మధ్యాహ్నం 3గంటలకు తెలంగాణా ఫిలిం ఛాంబర్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. ఇందులో తెలంగాణాలో సినిమా టికెట్ల రేట్ల గురించి పరిశ్రమకు సహకరించిన కె.సి.ఆర్.కు, కె.టి.ఆర్.కు ధన్యవాదాలు తెలుపుతున్నారు.
మరి ఆంధ్ర పరిస్థితికూడా అందుకు అనుకూలంగానే వుండబోతోంది. ఎ.పి. ప్రభుత్వం టిక్కెట్లను తగ్గడంపై ఎగ్జిబిటర్లు, నిర్మాతలు కోర్టుకు వెళ్ళారు. కోర్టు తీర్పు జనవరి 3న వెలువడనుంది. విశ్వసనీయ సమాచారం మేరకు పాత పద్దతిలోనే సినిమా టిక్కట్ల రేట్లు వుంటాయనీ, పెద్ద సినిమాలు వారంపాటు ఎక్కువ రేటుకు పెంచుకోవచ్చని తీర్పు రానున్నదని తెలుస్తోంది. ఇందుకు సినీ పెద్దలు కసరత్తు చేస్తున్నారు.