విజయవాడ నడిబొడ్డున మావోయిస్టులు - 31 మంది నక్సలైట్లు అరెస్టు
విజయవాడ నగర శివార్లలో మావోయిస్టుల కదలికలు తీవ్ర కలకలం రేపాయి. అత్యంత పకడ్బందీగా అందిన సమాచారంతో కేంద్ర, రాష్ట్ర బలగాలు సంయుక్తంగా చేపట్టిన భారీ ఆపరేషన్‌లో 27 మంది మావోయిస్టులు పట్టుబడ్డారు. కానూరు కొత్త ఆటోనగర్ ప్రాంతంలోని ఓ భవనాన్ని షెల్టర్‌గా మార్చుకుని కార్యకలాపాలు సాగిస్తున్న వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ జాయింట్ ఆపరేషనులో కేంద్ర బలగాలతో పాటు ఆక్టోపస్, గ్రేహౌండ్స్ దళాలు పాల్గొన్నాయి.
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన చెందిన ఈ మావోయిస్టుల బృందం సుమారు 10 రోజుల క్రితం విజయవాడకు చేరుకుంది. తాము కూలీ పనుల కోసం వచ్చామని స్థానికులను నమ్మించి, ఆటోనగరులోని ఓ రెండు అంతస్తుల భవనాన్ని అద్దెకు తీసుకున్నారు. అయితే, వీరి కదలికలపై అనుమానం రావడంతో నిఘా వర్గాలు సమాచారం సేకరించాయి.
దీని ఆధారంగా బలగాలు మంగళవారం తెల్లవారుజామున ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని మెరుపుదాడి చేశాయి. ఈ ఆపరేషనులో 12 మంది మహిళలు, నలుగురు కీలక స్థాయి నేతలతో పాటు 11 మంది మిలీషియా సభ్యులు, సానుభూతిపరులను అరెస్టు చేసినట్లు అధికారులు ధృవీకరించారు.
విచారణలో మావోయిస్టులు నగర శివార్లలో నాలుగు చోట్ల ఆయుధాలు, పేలుడు పదార్థాలతో కూడిన డంప్లను ఏర్పాటు చేసినట్లు కీలక సమాచారం లభించింది. దీంతో అప్రమత్తమైన బలగాలు ఆటోనగర్ పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి. డంప్లను గుర్తించి స్వాధీనం చేసుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. మరోవైపు, మావోయిస్టులకు ఆశ్రయం కల్పించిన భవన యజమాని గత నెలన్నరగా విదేశాల్లో ఉండటంతో భవన వాచ్మెన్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.
గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాలకే పరిమితమైన మావోయిస్టులు.. వ్యూహం మార్చి విజయవాడ వంటి కీలక నగరంలో స్థావరం ఏర్పాటు చేసుకోవడం భద్రతా వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నగరంలో ఉంటూ తమ కార్యకలాపాలను విస్తరించే ప్రణాళికలో భాగంగానే ఇక్కడికి వచ్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనతో విజయవాడతో పాటు పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.