1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 31 డిశెంబరు 2021 (11:48 IST)

సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్న 'తెల్ల బంగారం'

పత్తిని తెల్ల బంగారంగా పిలుస్తుంటారు. ఈ పత్తికి సరైన గిట్టుబాటు ధర లేక అనేక మంది పత్తి రైతులు ఆత్మహత్యలు చేసుకున్న విషయం తెల్సిందే. అయితే, ఇపుడు ఈ తెల్ల బంగారం ధర సరికొత్త రికార్డులను నెలకొల్పుతోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా రూ.9 వేలను టచ్ చేసింది. పుష్కలమైన వర్షాలతో దిగుబడి తక్కువగా వచ్చినా రికార్డు స్థాయి ధరలో రైతుల ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తుంది. 
 
తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా జమ్మిగుంట వ్యవసాయ మార్కెట్‌లో రోజురోజుకూ పత్తి ధరలు పెరుగుతున్నాయి. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత యేడాది ఎకరానికి 8 నుంచి 10 క్వింటాళ్ల  పత్తి దిగుబడి వచ్చినా క్వింటాలుకు 4 వేల నుంచి 5 వేల వరకు మాత్రమే ధర పలికింది. దీంతో చేసిన ఖర్చులు కూడా రాలేదు. 
 
కానీ, ఈ యేడాది దిగుబడి తగ్గినప్పటికీ ధర మాత్రం రికార్డు స్థాయిలో రూ.9 వేల వరకు పలుకుతుంది. దీంతో పత్తి రైతులు సంతోష పడుతున్నారు. దేశ వ్యాప్తంగా పత్తి దిగుబడి ఈ యేడాది బాగా తగ్గిపోయింది. దీనికి కారణం విస్తారంగా వర్షాలు కురవడమే. అదేసమయంలో అంతర్జాతీయ మార్కెట్‌లో పత్తికి డిమాండ్ పెరిగింది. ఈ కారణంగా పత్తి ధర ఒక్కసారిగా పెరిగిందని వ్యాపారులు అభిప్రాయపడుతన్నారు.