జగన్‌కు అనిత బహిరంగ లేఖ- రాష్ట్రంలో యథా లీడర్ తథా క్యాడర్
తెలుగుదేశం మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఏపీ సీఎం జగన్‌కు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో యథా లీడర్ తథా క్యాడర్ అన్నట్టు పరిస్థితి తయారైందన్నారు. మహిళలపై అఘాయిత్యాలు నిత్యకృత్యమవడానికి ప్రభుత్వ బాధ్యతారాహిత్యమే కారణమని విమర్శించారు.
'అర్ధరాత్రి ఆడబిడ్డ స్వేచ్ఛగా తిరిగినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం అని మహాత్ముడు చెప్పారు. కానీ 'మీ' (జగన్) పాలనలో ఆ పరిస్థితులు ఉన్నాయా అని ఒక్కసారి గుండె మీద చేయివేసుకుని చెప్పాలి అన్నారు. ఒక మహిళగా ఎంతో వేదనతో ఈ లేఖ రాస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయని.. మచిలీపట్నంలో వీఓఏ నాగలక్ష్మి ఆత్మహత్యను ఈ లేఖలో అనిత ప్రస్తావించారు.
ఈ లేఖనూ తేలిగ్గా తీసుకుంటారనుకుంటానని.. అయినా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, వేధింపుల పర్వం గురించి సీఎం దృష్టికి తీసుకురావాలని ప్రయత్నిస్తూనే ఉన్నట్లు చెప్పుకొచ్చారు. నాగలక్ష్మిది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని ఆరోపించారు అనిత.
తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించి ఉంటే ఇలాంటి ఘటనలు జరిగేవా.. మహిళలకు రక్షణగా నిలవాల్సిన అధికార పార్టీ నేతలే కాలకేయుల్లా అఘాయిత్యాలకు తెగబడుతుంటే సిగ్గుగా అనిపించడం లేదా అన్నారు. వారిపై ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు.