శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : సోమవారం, 6 మే 2019 (16:13 IST)

తెలుగు రాష్ట్రాలపై పగబట్టిన భానుడు... (Video)

తెలుగు రాష్ట్రాలపై భానుడు పగబట్టినట్టు కనిపిస్తున్నాడు. నిప్పులు కురిపిస్తూ ప్రజలను అల్లాడిస్తున్నాడు. ఫణి తుఫాను అటు వెళ్లిందో లేదో, ఇటు భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉదయం 7 గంటల రాత్రి 9 గంటల వరకు ఏమాత్రం కనికరం చూపడంలేదు. ఫలితంగా ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. వీధులు, రోడ్లు నిప్పుల కొలిమిలా మారిపోతున్నాయి. వడగాలులు ముఖంపై చాచికొడుతున్నాయి. భానుడి ప్రకోపానికి ప్రజలు బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. 
 
నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వేసవిలో ఉష్ణోగ్రతల్లో కొంత వ్యత్యాసం ఉంటుంది. అయితే, ఈసారి మాత్రం అటువంటి తేడాలు ఏమీ కనిపించడం లేదు. కోస్తా, రాయలసీమ అనే తేడా లేకుండా భానుడు నిప్పుల వాన కురిపిస్తున్నాడు. ఉదయం ఏడు గంటలకే ప్రారంభమవుతున్న వేడిమి సాయంత్రమైనా తగ్గుముఖం పట్టడం లేదు. ఆదివారం కృష్ణా, గుంటూరుతోపాటు ఉభయగోదావరి, నెల్లూరు జిల్లాల్లో వడగాలులు ప్రజలను ఇక్కట్లకు గురిచేశాయి. తెలంగాణలోనూ భానుడి ప్రతాపం కొనసాగుతోంది. 
 
ఇకపోతే, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ దాదాపుగా ఇదే పరిస్థితి నెలకొంది. సాధారణం కంటే 5 నుంచి 7 డిగ్రీల ఉష్ణోగ్రత అధికంగా నమోదైంది. అనేక ప్రాంతాల్లో 45 నుంచి 46 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పోలవరంలో రెండు రోజులుగా 45.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదవుతోంది. రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉదయం పది గంటల నుంచి ఎండ ప్రభావం తగ్గేవరకు అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని వాతావరణ శాఖ అధికారులు, వైద్యులు సూచిస్తున్నారు. 
 
సోమ, మంగళవారాల్లో పగటిరే ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ రెండు రోజుల్లో 45 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వారు హెచ్చరించారు. రాబోయే రెండు రోజులు ఉష్ణోగ్రతల్లో అసాధారణ మార్పులు ఉంటాయని, వడగాలులు తీవ్రం అవుతాయని వాతావరణ శాఖ నుంచి తెలిపింది. 
 
ఈనెల పదో తేదీ వరకు ఎండల తీవ్రత ఇలానే ఉంటుందని తెలిపారు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే వడదెబ్బకు గురికాకుండా తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. గొడుగు, టోపీ, లేదంటే తలపై వస్త్రం కప్పుకోకుండా బయటకు రావొద్దన్నారు. వృద్ధులు, పిల్లలు ఎండలో బయటకు రాకపోవడమే మంచిదన్నారు.
 
స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి చలివేంద్రాలను విరివిగా ఏర్పాటు చేయాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లలో ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. అలాగే పశువులకు నీటి తొట్టెల ద్వారా నీటిని ఏర్పాటు చేయాలని పశుసంవర్ధకశాఖ అధికారులు సూచించారు.