నిప్పుల కొలిమిని తలపిస్తున్న ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. ఫణి తుఫాను తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగాయి. వాతావరణంలోని తేమను ఫణి తుఫాను లాగేసుకోవడంతో వాతావరణం అత్యంత పొడిగా మారిపోయింది. దానికి తోడు భానుడి భగభగలు, పశ్చిమం నుంచి వీస్తున్న వేడిగాలులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
ఆదివారం రాష్ట్రంలో పలు చోట్ల 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవడం ఆందోళనకు గురిచేస్తోంది. ప్రకాశం జిల్లా దొనకొండలో అత్యధికంగా 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కృష్ణా జిల్లా జి.కొండూరులో 45.89 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. రాష్ట్రంలో ఆదివారం 52 ప్రాంతాల్లో 45 డిగ్రీల పైన ఉష్ణోగ్రత నమోదు కాగా, 127 ప్రాంతాల్లో 44 డిగ్రీలకు పైగా నమోదైంది. ఆర్టీజీఎస్ ఇంతకుముందే ప్రజలకు వడగాడ్పుల హెచ్చరికలు జారీచేసిన సంగతి తెలిసిందే.