రాజధాని పేదల సమస్యలపై ప్రజాభేరి
రాజధాని పేదల పెన్షన్ రూ.5వేలకు పెంచాలని, ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, ఉపాధి హామీ చూపాలని, రాజధాని కొనసాగించాలని తదితర డిమాండ్లతో సిపిఎం రాజధాని డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో రాజధాని ప్రజల సమస్యల పరిష్కారం కోసం అక్టోబర్ 26 నుండి నవంబర్ 6 వరకు జరగనున్న ప్రజాభేరిని మంగళగిరి రూరల్ మండలం నిడమర్రు గ్రామంలో ప్రారంభించారు.
ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్. బాబూరావు మాట్లాడుతూ రాజధాని పేదల నోట్లో ప్రభుత్వం మట్టి కొట్టిందని పేర్కొన్నారు. రాజధాని కూలీలకి ఇచ్చే రూ.2500లు పెన్షన్ గత 5 నెలల నుండి ఇవ్వడం లేదని ఇలా అయితే పేదలు ఎలా బతకాలని ప్రశ్నించారు. ఎన్నికలప్పుడు రూ.2500లు పెన్షన్ రూ.5000లకు పెంచుతామని హామీ ఇచ్చారని ఆ హామీ నేడు ఏమైందని ప్రశ్నించారు.
రాజధానిలో ఉపాధి లేక, ప్రభుత్వం ఇచ్చే రాజధాని పెన్షన్ రాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఈ క్రమంలో విద్యుత్ బిల్లుల భారం కూడా ప్రజలపై పడిందన్నారు. పేదలకు ఇస్తామన్న ఇల్లు నేటికీ ఖాళీగా దర్శనమిస్తున్నాయని పేర్కొన్నారు. ఒకవైపు ఉపాధి లేక మరోవైపు లాక్‌డౌన్ వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఏళ్ల కిందట నిర్మించుకున్న ఇళ్లకు నేడు ఒటిఎస్ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు.
రాజధాని రైతుల, పేదల సమస్యల పరిష్కారం కోసం నవంబర్ 6వ తేదీ వరకు గ్రామ గ్రామాన ఈ ప్రజాభేరి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ముగింపురోజున సిఆర్‌డిఎ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి, కార్యదర్శి వర్గ సభ్యులు ఎం భాగ్యరాజు, వి వెంకటేశ్వరరావు, డివిజన్ నాయకులు కె వెంకటేశ్వర్లు, కె ప్రకాశరావు, కుంపటి వీరయ్య పాల్గొన్నారు.