సోమవారం, 18 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

ఎన్డీయే ప్రభుత్వంలో వైకాపా చేరాలి : కేంద్ర మంత్రి

కేంద్రంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వంలో వైకాపా చేరాలని కేంద్ర మంత్రి రాందాస్‌ అథవాలే స్పష్టం చేశారు. విశాఖలో ఆయన ఆదివారం మాట్లాడుతూ, సీఎం జగన్‌ తనకు మంచి మిత్రుడని తను ఎన్డీఏలో చేరాలని కోరారు. 
 
ఎన్డీయేలో చేరితే హైవేలు, నీటిపారుదల ప్రాజెక్టుల్లో ఏపీకి మేలు జరుగుతుందన్నారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణతో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు విఘాతం కలుగుతుందని.. అయితే ఎలాంటి నష్టం జరగకుండా ఉండేందుకు పార్లమెంటరీ కమిటీని సిఫార్సు చేశామన్నారు. 
 
దేశంలో మరో 15 ఏళ్ల వరకు కాంగ్రెస్‌ పార్టీ పుంజుకునే అవకాశం లేదన్నారు. పీవోకే.. భారత్‌లో అంతర్భాగం అన్న కేంద్ర మంత్రి..  పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ పీవోకే వదిలి వెళ్లాలన్నారు. పీవోకే వీడితేనే భారత్‌-పాక్‌ మధ్య స్నేహం కొనసాగుతుందని అథవాలే అన్నారు.
 
ఇకపోతే, ఏపీకి మూడు రాజధానులు అంటూ వైసీపీ సర్కారు పేర్కొన్న నేపథ్యంలో విపక్షాలు ఆ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుండడం తెలిసిందే. విభజనచట్టంలో ఒక రాజధాని అని మాత్రమే పేర్కొన్నారని విపక్షాలు ఎలుగెత్తుతున్నాయి. మూడు రాజధానుల అంశం కేంద్రం పరిధిలో లేదని స్పష్టం చేశారు.