బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 27 జులై 2020 (09:23 IST)

ప్రభుత్వ ప్రలోభాలకు లొంగితే దళిత జాతే కనుమరుగవుతుంది: మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు

దళిత బాలికపై ఏడురోజులపాటు, అమానుషానికి పాల్పడి, చిత్రహింసలు పెట్టి, అత్యాచారంచేశారని, ఆ బాలిక దీనస్థితికి చలించిపోయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆమెకుటుం బానికి రూ.2లక్షల పరిహారం అందించారని, ఆమె చదువుకు అయ్యే ఖర్చు భరిస్తామని చెప్పడం జరిగిందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గొల్లపల్లిసూర్యారావు చెప్పారు.

ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు.  బాలికపై దుర్మార్గానికి పాల్పడిన వారిపై కేసు పెట్టకుండా పోలీసులు తిరిగి బాలికనే వేధించారన్నారు. మాటల్లో చెప్పలేని విధంగా, అత్యంత జుగుప్సాకరంగా ఏడురోజులపాటు ఆమెపై దారుణానికి పాల్పడటం దుర్మార్గమన్నారు. 

బాలికకు ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారని, ముగ్గురు ఆడపిల్లలతో  మగదిక్కు లేకుండా సంసారం నెట్టుకొస్తున్న ఆ తల్లి, చంద్రబాబు గారు చేసిన సాయంపై కన్నీళ్లతోనే కృతజ్ఞతలు తెలియచేసిందన్నారు. తమజాతిపై ఔదార్యం చూపుతన్న టీడీపీ అధినేతకు తాము కూడా ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.

వరప్రసాద్ అనే మరో యువకుడు, వైసీపీ నేతల ఇసుక మాఫియాను ప్రశ్నించాడన్న అక్కసుతో అతన్ని చిత్రహింసలకు గురిచేసి, శిరోముండనం చేశారన్నారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న పెత్తందారీ పోకడలను, దుర్మార్గపు చర్యలను ప్రశ్నిస్తూ, చైతన్యవంతంగా వ్యవహరించే దళిత కుటుంబాలనే వైసీపీ ప్రభుత్వం లక్ష్యంగా ఎంచుకుందని మాజీ మంత్రి తెలిపారు.

గుండు గీయించడం అంటే ఎంతటి అవమానమో, ఇంత జరిగినా దళితజాతి వెధవప్రభుత్వాలకు భయపడి, ఎందుకింతలా భయపడుతుందో తెలియడం లేదన్నారు.  వరప్రసాద్ కేసులో విజయకుమార్ అనే యువకుడికి ఏవో దెబ్బలు తగిలాయని, అతను రాజమండ్రిలో చికిత్సపొందుతున్నాడని సాక్షిలో అభూతకల్పనలతో తప్పుడు వార్తలు రాయడం జరిగిందన్నారు. 

దళితజాతి ప్రయోజనాలను తమస్వార్థంకోసం తాకట్టు పెట్టే కుటిల ప్రయత్నాలను కొందరు దళితులు మానుకోవాలన్నారు. చంద్రబాబు హయాంలో ఎవరైనా ప్రభుత్వంపై ప్రశ్నించినా, నిందారోపణలుచేసినా, ఆయన ఏనాడు వారిని ఏమీ అనలేదన్నారు.

ఈ ప్రభుత్వం వచ్చాక డాక్టర్ సుధాకర్, అనితారాణి, న్యాయమూర్తి రామకృష్ణలపై వేధింపులు, వరప్రసాద్ కు శిరోముండనం, దళిత బాలికకు జరిగిన అవమానాలపై దళితులు ఎందుకు ప్రశ్నించడంలేదన్నారు. ఇసుక, మద్యం, ఇళ్లస్థలాల పేరుతో దోచుకున్నారని, తూర్పుగోదావరిలో జరిగిన భూములకొనుగోళ్లలో రూ.4వేలకోట్ల వరకు వైసీపీ మాఫియా చేతుల్లోకి వెళ్లాయన్నారు. 

దళితులు, గిరిజనులకు రాజ్యాంగబద్ధంగా అందాల్సిన హక్కుల, నిధులను కూడా ఈ ప్రభుత్వం దారి మళ్లించిందన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ఏమయ్యాయో  తెలియడం లేదని, ఒక దళితవాడలో గానీ, గిరిజన ప్రాంతాల్లో గానీ ఎక్కడా చిన్నరోడ్డు కూడా వేయలేదన్నారు.

ఒక్క దళిత విద్యార్థికైనా ఈ ప్రభుత్వం స్కాలర్ షిప్ ఇచ్చిందా అని గొల్లపల్లి నిలదీశారు. అవినీతిపరుల ప్రలోభాలకు లొంగి, దళిత జాతి ఐక్యతను ప్రభుత్వానికి తాకట్టుపెట్టే చర్యలకు పాల్పడవద్దని సాటి దళితసోదరులకు విజ్ఞప్తి చేస్తున్నట్లు సూర్యారావు చెప్పారు.

దళిత జాతికోసం చంద్రబాబుతో, రాజశేఖర్ రెడ్డితో కూడా పోరాటం చేశానని, రాజ్యాంగ పరిరక్షణే ధ్యేయంగా దళితులంతా ఏకతాటిపై నిలవాలన్నారు.  తమని తాము ద్వేషించుకుంటే, తమలో తాము కొట్లాడుకుంటే, మనల్ని మరింత అణగదొక్కుతారనే విషయాన్ని దళిత జాతి గ్రహించాలన్నారు. 

కావాలి జగన్, రావాలి జగన్ అనే వాక్యాలను రాసిచ్చింది దళిత యువకుడు రాజేశ్ అని, ఇప్పుడతని పరిస్థితిఏమైందో అందరం చూస్తూనే ఉన్నామన్నారు. చంద్రబాబు హయాంలో ఎస్సీ, ఎస్టీలకు సబ్ ప్లాన్ నిధులు, ఇతర సంక్షేమపథకాలు కేటాయించి, వారి అభివృద్దికి 70శాతం వరకు చేయాల్సింది చేశారన్నారు.

అటువంటి వ్యక్తి నాయకత్వంలో బహుజనుల సంక్షేమం, వారి రక్షణ కోసం, హిట్లర్ భావజాలంతో హింసావాదిలా వ్యవహరిస్తున్న  జగన్ పై పోరాటం చేయాలని సూర్యారావు పిలుపునిచ్చారు.