ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 31 జనవరి 2020 (20:56 IST)

పింఛన్ల చెల్లింపులో సువర్ణ అధ్యాయం.. ఇంటి వద్దనే నేరుగా చెల్లింపు

‘ఎన్నికల మేనిఫెస్టో నాకు ఒక భగవద్గీత. ఒక ఖురాన్‌. ఒక బైబిల్‌. అందులో చెప్పిన ప్రతి మాటకు కట్టుబడి ఉంటాను’ అని ఎన్నికల ముందు చెప్పిన సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, అధికారం చేపట్టిన నాటి నుంచి ఆ దిశలోనే అడుగులు వేస్తున్నారు.

ఎన్నికల ప్రణాళికలో చెప్పిన వాటిలో 80 శాతానికి పైగా ఇప్పటికే నెరవేర్చిన ఆయన, తాజాగా ‘వైయస్సార్‌ పింఛను కానుక’ లో ఒక సువర్ణ అధ్యాయానికి తెర తీశారు. 
 
డోర్‌ డెలివరీ:
ఎన్నికలకు కొన్నివారాల ముందు వరకూ కేవలం రూ.1000 మాత్రమే ఉన్న పెన్షన్‌ను రూ.2,250 చేయడంతో పాటు, రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 54.64 లక్షల మందికి  పింఛను ఇస్తున్నారు. అది కూడా నేరుగా ఇంటికే వచ్చి ఆ పింఛను చెల్లిస్తున్నారు.

గ్రామ సచివాలయాలు, వాలటీర్ల వ్యవస్థ ద్వారా లబ్ధిదారులను నేరుగా ఇంటివద్దే పింఛను అందజేస్తారు. ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల కార్యదర్శుల పేరుతో బ్యాంక్‌ ఖాతాలు ప్రారంభించిన ప్రభుత్వం, లబ్ధిదారులను చెల్లించే పింఛను మొత్తాన్ని ఆయా ఖాతాల్లో జమ చేసింది.

పింఛన్ల చెల్లింపు కోసం ప్రతి వలంటీరుకు స్మార్ట్‌ ఫోన్‌ ఇచ్చారు. ఆ ఫోన్లలో బయోమెట్రిక్‌ ఆధారంగా పింఛన్ల పంపిణీ ప్రక్రియ కొనసాగుతుంది. శనివారం మధ్యాహ్నానికి ఈ చెల్లింపు ప్రక్రియ పూర్తి కానుంది. ఎక్కడైనా బయోమెట్రిక్‌ సమస్య ఉత్పన్నమైతే, సరిచేసి మర్నాటికల్లా పింఛను చెల్లిస్తారు.

పింఛన్ల చెల్లింపు కోసం ప్రభుత్వం ఈ ఏడాది రూ.15,675.20 కోట్లు కేటాయించగా, శనివారం నాటి చెల్లింపుల కోసం రూ.1320.14 కోట్లు విడుదల చేశారు. 

అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛను మొత్తం రూ.1000 నుంచి రూ.2 వేలు చేయడంతో పాటు, ఏటా రూ.250 పెంచుకుంటూ పోయి నాలుగేళ్లలో మొత్తం రూ.3 వేల పెన్షన్‌ చెల్లిస్తామని వైయస్‌.జగన్‌ హామీ ఇచ్చారు.

ఇచ్చిన హామీ ప్రకారం ఎక్కడా రాజీ లేకుండా, సంతృప్తికర స్థాయిలో అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛను అందించేలా 2019–20లో ఇందు కోసం రూ.15675.20 కోట్లు కేటాయించింది.
 
ఎవరెవరికి ఎంతెంత?
వృద్ధులు, వితంతువులు, చేనేత కార్మికులు, మత్స్యకారులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, చర్మకారుల్లో అర్హులకు రూ.2250 పింఛను ఇస్తారు. ఆ తర్వాత దీన్ని పెంచుకుంటూ పోయి రూ.3వేలు చేస్తారు.

అదే విధంగా వృథాప్య పింఛన్ల చెల్లింపునకు కనీస వయస్సు గతంలో 65 ఏళ్లు ఉండగా, దాన్ని 60 ఏళ్లకు తగ్గించారు. దివ్యాంగులు, డప్పు కళాకారులు, ట్రాన్స్‌జెండర్స్‌కు కూడా రూ.3 వేల పెన్షన్‌ ఇస్తున్నారు. 

తలసేమియా, సికిల్‌సెల్‌ ఎనీమియా, తీవ్ర హీమోఫీలియాతో బాధ పడుతున్న వారికి రూ.10వేల పెన్షన్, తీవ్ర బోదకాలు వ్యాధితో బాధ పడుతున్న వారికి, తీవ్ర పక్షవాతంతో చక్రాల కుర్చీకి  లేదా మంచానికి పరిమితమైన వారికి, తీవ్ర కండరాల క్షీణతతో కదల్లేని పరిస్థితిలో ఉన్న వారికి, ప్రమాదాల బారిన పడి, శరీరం సహకరించని స్థితిలో చక్రాల కుర్చీకి లేదా మంచానికి పరిమితమైనవారికి నెలకు రూ.5వేల చొప్పున పెన్షన్‌ మంజూరు చేశారు.

అలాగే డయాలసిస్‌ చేయించుకోకుండా తీవ్ర కిడ్నీ వ్యాధి అడ్వాంటేజ్‌ స్టేజిలో ఉన్న వారికి అంటే.. స్టేజ్‌ 3,4,5 పరిస్థితిని ఎదుర్కొంటున్నవారికి నెలకు రూ.5వేల చొప్పున పెన్షన్‌ ఇస్తున్నారు. 
 
పారదర్శకంగా లబ్ధిదారుల గుర్తింపు
వైయస్సార్‌ నవశకం కార్యక్రమం ద్వారా పారదర్శకంగా అర్హులను గుర్తించారు. గ్రామ వాలంటీర్లు ప్రతి కుటుంబం వద్దకు వెళ్లి... దరఖాస్తులను స్వీకరించారు. అర్హుల జాబితాను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించారు. ఎవరైనా మిగిలిపోయినా వారికి మళ్లీ దరఖాస్తు చేసుకునేలా అక్కడే సమాచారాన్ని పొందుపరిచారు.

నిరంతర సోషల్‌ఆడిట్‌ ద్వారా అవినీతి లేకుండా అత్యంత పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక జరిగింది. ఎలాంటి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ఈ ప్రక్రియ ముగిసింది. 
 
పింఛన్లకు అర్హత:  
గత ప్రభుత్వం నిర్దేశించిన దానికంటే అర్హతలను సడలించి మరింత మందికి మేలు జరిగేల ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికోసం ఉద్దేశించిన భూపరిమితులను సడలించారు.

గతంలో మాగాణి 2.5 ఎకరాలు, మెట్టు 5 ఎకరాలు లేదా రెండూ కలిపితే 5 ఎకరాల్లోపు ఉన్న వారే అర్హులని ప్రకటించగా 5 ఎకరాల మాగాణి లేదా, 10 ఎకరాల్లోపు మెట్ట ఉన్నవారికీ, లేదా రెండూ కలిపి 10 ఎకరాలలోపు ఉన్నవారికి వర్తిస్తుందని తాజా నిబంధనల్లో పేర్కొన్నారు. దీంతో పాటు బియ్యం కార్డు కోసం సడలించిన అర్హతలనూ వైయస్సార్‌ పెన్షన్‌ కానుకకూ వర్తింప చేయాలని ప్రభుత్వం నిశ్చయించింది. 

బియ్యం కార్డు
గతంలో గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.5వేల లోపు, పట్టణ ప్రాంతాల్లో రూ.6,250 ఆదాయం ఉన్నవారికే పెన్షన్‌ వర్తిస్తుందని నిబంధనలు పెట్టారు. తాజాగా ప్రభుత్వం దీన్ని సడలించింది. గ్రామీణ ప్రాంతాల్లో నెల వారీ ఆదాయం రూ.10వేలు, పట్టణ ప్రాంతాల్లో నెలవారీ ఆదాయం రూ.12 వేలు లోపు ఉన్నవారికి వర్తించేలా మార్పు చేశారు.

గతంలో పెన్షన్‌ పొందాలంటే  నెలకు 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్‌  వినియోగం ఉంటేనే అర్హులు. కాని దీన్ని సడలిస్తూ నెలకు సరాసరి సగటు 300 యూనిట్లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

కుటుంబంలో 80 శాతానికి పైగా దివ్యాంగులు, డయాలసిస్‌ రోగులు, మానసికంగా తీవ్రంగా బాధ పడుతున్న వారుంటే, ఆ ఇంటిలో రెండో వ్యక్తికి కూడా పింఛను చెల్లిస్తారు.