శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 25 సెప్టెంబరు 2020 (08:25 IST)

అక్టోబరు 1న వృత్తి పన్ను విభాగం వెబ్‌సైట్ ప్రారంభం

అక్టోబరు 1న వృత్తి పన్ను వసూలుకు సంబంధించి నూతన వెబ్‌సైట్‌ను ప్రారంబించడం జరుగుతుందని రాష్ట్ర వాణిజ్య ప‌న్నుల విభాగం ప్ర‌ధాన అధికారి పియూష్‌కుమార్ వెల్లడించారు. అమరావతి సచివాలయంలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో రాష్ట్రంలో వృత్తి పన్ను వసూలుకు సంబంధించిన 18శాఖలకు చెందిన శాఖాధిపతులతో ఆయన సమీక్షించారు.

ఈ సందర్భంగా పియూష్‌కుమార్ మాట్లాడుతూ వృత్తి పన్ను చట్టానికి సంబంధించి గత ఆగస్టు 24వతేదీన జారీ కాబడిన జిఓ సంఖ్య 663 ప్రకారం ప్రతి సర్వీస్ ప్రొవైడర్ వృత్తి పన్ను చెల్లించారా లేదా అనేది పరిశీలించాలని అన్నారు. ఇందుకుగాను సర్వే నిర్వహించి మరిన్ని రిజిష్ట్రేషన్లు జరిగేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

అంతేగాక 10 రోజుల్లోగా నూతన వృత్తి పన్ను చట్టానికి అనుగుణంగా అమెండ్మెంట్స్ చేసుకుని ప్రభుత్వ అనుమతి తీసుకుని ఆమేరకు వృత్తి పన్ను వసూలులో మరింత మెరుగైన ప్రగతి సాధించేలా ఆశాఖల అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని చీఫ్ కమీషనర్ ఆఫ్ స్టేట్ టాక్సెస్ పియూష్ కుమార్ స్పష్టం చేశారు.

రాష్ట్రంలో 2019-20 ఆర్ధిక సంవత్సరంలో రూ.233 కోట్ల వృత్తి పన్ను వసూలు కావడం జరిగిందని దీనిని ఈఏడాది రెట్టింపు మేర వసూలు చేసేందుకు కృషి చేయాలని ఆయా శాఖల అధికారులకు పియూష్‌కుమార్ సూచించారు. సమీక్ష‌లో వృత్తి పన్ను వసూలుకు సంబంధించి లక్ష్యాలను అధికమించేందుకు వీలుగా తీసుకోవాల్సిన చర్యలపై ఆయా శాఖాధి పతులకు ఆయన తగిన సూచనలు అందించారు.

సమావేశంలో రాష్ట్ర స్టాంపులు రిజిస్ట్రేషన్ల ఐజి సిద్ధార్ధ జైన్, ఉన్నత విద్యాశాఖ కమీషనర్ ఎం.ఎం.నాయక్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అదనపు కమీషనర్ కె.ఎల్.భాస్కర్, వాణిజ్య పన్నులు, రవాణా, ఎక్సైజ్ తదితర 18 విభాగాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.