నిన్న అమెజాన్ ... నేడు మైత్రా ... రేపు ఎవరు? టీటీడీలో కార్పొరేట్ పై నిరసన
తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏం జరుగుతోందని కమ్యూనిస్టు, కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. అమెజాన్ సంస్థ అధిక ధరలకు టిటిడి క్యాలెండర్లు డైరీలు అమ్ముకుని దందాను సాగించిందని ఆరోపిస్తున్నారు. ఇప్పుడు తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సలహాలు ఇవ్వడం కోసం మైత్రా కంపెనీ సీఈవోని సలహాదారుగా నియమించడంపై నిరసన తెలుపుతున్నారు.
టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఈ నిమాకం లేఖను అందించడం సమంజసం కాదని సి.ఐ.టి.యు నేత కందారపు మురళి విమర్శించారు. సమర్థులైన సాంకేతిక సలహాదారును నియమించుకోవటం తప్పేమీ కాదని, ఆ పేరుతో కార్పొరేట్ కంపెనీల సిఇఓ లను నియమించుకోవడం, ధార్మిక క్షేత్రంలో వివాదాస్పద నిర్ణయాలు చేయడం సమంజసం కాదని అన్నారు.
అమెజాన్ కంపెనీతో భక్తుల మనోభావాలకు భిన్నంగా ఒప్పందం చేసుకున్న టిటిడి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు డిమాండ్ చేశారు. కపిలతీర్థం రోడ్డు లోని టిటిడి పరిపాలనా భవనం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. టిటిడి ప్రచురించి 15 రూపాయలకే అమ్ముతున్న క్యాలెండర్ ను అమెజాన్ కంపెనీ ఆన్లైన్ అమ్మకాలలో 300 రూపాయలుగా చూపి 150 రూపాయలు రాయితీతో 149 రూపాయలకే అమ్ముకుంటోందని పేర్కొన్నారు. ఈ ప్రకటన చేసుకునేందుకు అవకాశం ఎవరిచ్చారని, దీని వెనుక సూత్రధారులు, పాత్రధారులు ఎవరని? ఎవరి ప్రయోజనాల కోసం అమెజాన్ కంపెనీతో తప్పుడు ఒప్పందాలు చేసుకున్నారని నాగరాజు ప్రశ్నించారు.
దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని నాగరాజు డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో సిపిఎం నేతలు పి. సాయి లక్ష్మి, ఆర్. లక్ష్మి, చిన్నా, వేణు, ఆర్. మల్లికార్జున్ రావు, సుజాత, జయంతి, రవి, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.