గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 8 జూన్ 2021 (13:42 IST)

తిరుపతిలో థర్డ్ వేవ్ ప్రమాద ఘంటికలు : రుయాలో ప్రత్యేక కోవిడ్ వార్డు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో చిన్నపిల్లలు కరోనా బారిన పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొనడంతో కలకలం రేపుతోంది. రెండు రోజుల వ్యవధిలో 29మంది చిన్నారులు కోవిడ్ బారిన పడ్డారు. వీరంతా పదేళ్ళలేపు వారే కావడం గమనార్హం. దీంతో తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో చిన్నారుల కోసం ప్రత్యేకంగా కోవిడ్ వార్డును ఏర్పాటు చేశారు. 
 
దేశంలో కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఈ క్రమంలో థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలు ఉన్నట్టు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ హెచ్చరికల నేపథ్యంలో చిన్నారులు ఆసుపత్రి పాలవుతుండటం తల్లిదండ్రుల్లో ఆందోళన నింపింది.
 
కరోనా సోకిన పదేళ్లలోపు చిన్నారులు తొమ్మిది మంది తిరుపతి రుయా పరిధిలోని చిన్నపిల్లల ఆస్పత్రిలో అడ్మిట్‌ అయ్యారు. వీరిలో కడప, చిత్తూరు జిల్లాలకు చెందిన చిన్నారులను రూయా ఆస్పత్రిలో చేర్పించారు. వీరంతా శుక్రవారం రాత్రి నుంచి ఆదివారం సాయంత్రంలోపు చేరిన వారే.
 
వీరిని ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నట్లు రుయా అధికారులు తెలిపారు. రెండు రోజుల వ్యవధిలో ఇంతమంది పిల్లలు ఆస్పత్రిలో చేరడం రాష్ట్రంలో ఇదే తొలిసారని అధికారులు అంటున్నారు. గడిచిన 15 రోజుల్లో మరో 20 మంది చిన్నారులూ చికిత్స పొంది డిశ్చార్జ్‌ అయినట్లుగా తెలుస్తోంది.
 
వీరిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో తిరుపతి రుయాకు తరలించారు. ఇటీవల వీరి తల్లిదండ్రులకు పాజిటివ్‌ రావడంతో వారి నుంచి పిల్లలకు సోకి ఉంటుందని డాక్టర్లు భావిస్తున్నారు. థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో తిరుపతి రుయాలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఆస్పత్రుల్లో చిన్నారులతో వారి తల్లిని అనుమతి ఇస్తున్నారు. జర్మన్ హ్యాంగర్ విధానంలో నూతన హాస్పిటల్ ఏర్పాటుకు సిద్ధం చేస్తున్నారు.