గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 5 ఏప్రియల్ 2021 (09:44 IST)

బీజేపీకి షాక్.. ఎన్నికల గుర్తుగా గాజు గ్లాసు... జనసైనికుల్లో ఫుల్ జోష్

తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీకి షాక్ తప్పేలా లేదు. ఇప్పటికే ఈ స్థానంలో జనసేన పార్టీ సంపూర్ణ మద్దతునిస్తూ ఉమ్మడి అభ్యర్థిని రంగంలోకి దింపిన సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో జనసేనాని పవన్ రావడంతో బీజేపీలో కొత్త ఆశలు చిగురించాయి. కాగా తిరుపతి ఉప ఎన్నికలో జనసేన ఎన్నికల గుర్తు అయిన గాజు గ్లాసును నవతరం పార్టీకి ఎన్నికల కమిషన్ కేటాయించింది. దీంతో జనసేన ఓట్లు క్రాస్ అవుతాయని బీజేపీ ఆందోళన చెందుతోంది. 
 
ఎందుకంటే జనసేన గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా ఇంకా హోదా రాలేదు. ఈ ఎన్నికల్లో బీజేపీకి టికెట్ ఇవ్వడంతో జనసేన ఇక్కడ పోటీ చేయడం లేదు. ఈ నేపథ్యంలో నవతరం పార్టీ అభ్యర్థి గోదా రమేష్ కుమార్‌కు గాజు గ్లాసు గుర్తు కేటాయించారు. 
 
ఇప్పటికే జనసేనాని ఎంట్రీతో ఊపు వచ్చిందని అనుకుంటున్న బీజేపీకి ఈ వార్త షాకిచ్చినట్లయ్యింది. జనసేన పార్టీ ఎన్నికల గుర్తు గాజుగ్లాసును ఎన్నికల గుర్తుగా కేటాయించడంపై ఆ పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జనసేన అధ్యక్షుడు పవన్ బీజేపీతో పొత్తు పెట్టుకున్నందున తమ పార్టీ అభ్యర్ధికి గాజుగ్లాసు గుర్తు కేటాయించారని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం మీడియాకు తెలిపారు.