మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 23 మార్చి 2021 (08:53 IST)

ఫేస్‌బుక్ కంటెంట్‌ తనిఖీ కోసం ఇండిపెండెంట్ ఫ్యాక్ట్ చెకర్స్!

ప్రముఖ సామాజిక మాధ్యమాల్లో ఒకటైన ఫేస్‌బుక్ ఓ కీలక నిర్ణయం తీసుకుని అమలు చేస్తోంది. ఫేస్‌బుక్‌లో షేర్ చేసే సమాచారాన్ని చెకప్ చేసేందుకు స్వతంత్ర ఫ్యాక్ట్ చకర్స్‌ను నియమించింది. అలాగే, 2020లో అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌ వరకు 130 కోట్లకు పైగా ఫేక్‌ ఖాతాలను నిలిపివేసినట్లు ఫేస్‌బుక్‌ యాజమాన్యం సోమవారం తెలియజేసింది. 
 
తప్పుడు సమాచార వ్యాప్తిని అడ్డుకొనేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఫేస్‌బుక్‌ ప్రతినిధి రోసెన్‌ వెల్లడించారు. 60కి పైగా భాషల్లోని కంటెంట్‌ను నిశితంగా పరిశీలించడానికి స్వతంత్ర ఫ్యాక్ట్‌ చెకర్స్‌ను నియమించినట్లు తెలిపారు. ఏదైనా సమాచారం అసత్యమని తేలితే అది ఎక్కువ మందికి చేరకుండా చర్యలు తీసుకుంటున్నట్టు రోసెన్ వివరించారు. 
 
అలాంటి సమాచారంపై హెచ్చరిక సంకేతం ఉంటుందని, దాన్నిబట్టి అప్రమత్తం కావాలని సూచించారు. ఈ సంకేతం ఉన్న సమాచారాన్ని 95 శాతం మంది యూజర్లు క్లిక్‌ చేయడం లేదని అన్నారు. కోవిడ్‌–19 వ్యాక్సినేషన్‌పై దుష్ప్రచారం చేస్తున్న కంటెంట్‌ను కూడా పూర్తిగా తొలగించామన్నారు. ఇందుకోసం కృత్రిమ మేధ(ఏఐ)ను ఉపయోగించుకుంటున్నామని వివరించారు.