" బాబూ చిరంజీవీ.. నచ్చావోయ్... ఇందుక్కాదూ మెగాస్టారయింది నువ్వు.. ఆచార్యా.. టేకెబౌ"...
తెలుగు చిత్రపరిశ్రమ ధృవతార (మెగాస్టార్) చిరంజీవి... 65 యేళ్ల వయసుసులోనూ 25 యేళ్ల కుర్రోడిలా వరుసబెట్టి చిత్రాలు చేస్తున్నారు. ఎలాంటి బ్యాక్‌రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ కొణిదెల శివశంకర వరప్రసాద్.. కాస్త మెగాస్టార్ చిరంజీవిగా మారిపోయారు. తన స్థాయితో పాటు టాలీవుడ్ స్థాయిని పెంచారు. ఇపుడు తెలుగు చిత్రపరిశ్రమ అంటే కేరాఫ్ మెగా ఫ్యామిలీగా మారిపోయింది.
గతంలో సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చిన మెగాస్టార్.. మళ్లీ వరుస సినిమాలను ప్రకటించి ఈ తరం హీరోలకి 'ఛాలెంజ్' విసురుతున్నారు. మాట ఇస్తే.. మడమతిప్పను.. అనేలా అంగీకరించిన సినిమాల షూటింగ్స్‌ని కూడా పరుగులు పెట్టిస్తున్నారు. ఆయన స్పీడ్ చూసిన ఓ దర్శకుడు తాజాగా తన ఫేస్‌బుక్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇంతకీ ఎవరా దర్శకుడు అనుకుంటున్నారు కదా..! ఆంధ్రాపోరి, రుషి, ఐతే 2.0 చిత్రాల దర్శకుడు రాజ్ మాదిరాజు. ఆయన మెగాస్టార్ గురించి పెట్టిన పోస్ట్ ఇదే..
"చిరంజీవి అని ఇండస్ట్రీకి ఓ కొత్తబ్బాయొచ్చాడంట..
పొద్దున్నే నాలుగున్నరకి లేచి గంటన్నరసేపు జిమ్ములో కసరత్తులు చేస్తున్నాడంట..
నిన్ననే "ఆచార్య" అనే సినిమాకి గుమ్మడికాయ కొట్టేశాడంట..
మండే మార్చి, ఏప్రిల్, మే ఎండల్లో ఒక సినిమా షూటింగుకి డేట్లిచ్చాడంట..
జూనొదిలేసి జూలై, ఆగస్టు, సెప్టెంబరు రెండోది, అక్టోబరు నుంచి క్రిస్మస్‌లోగా మరోటి షూటింగు ఫినిష్ చేయాలని ప్లానింగంట..
పారలల్‌గా రైటర్లతో కథాచర్చల్లో.. కూర్చుంటే పన్నెండు పద్నాలుగు గంటలపాటు నాన్‌స్టాప్ కొట్టేస్తన్నాడంట..
షాటు పూర్తయాక సెట్టులోనే కుర్చీ వేసుక్కూర్చుంటన్నాడంట.. క్యారవానెక్కి కూర్చునే పనే లేదంట.. మిగతా యాక్టర్లందరూ చచ్చుకుంటూ పక్కనే కూర్చుని షాటుకోసం వెయిటింగంట..
బాబూ చిరంజీవీ.. నచ్చావోయ్..
యేడాదికి మూడు సినిమాలు షూటింగు అలవోకగా ఫినిష్ చేసి రిలీజు చేయగలిగిన దమ్మున్నోడివి గాబట్టి కాదూ..
అరవయ్యయిదొచ్చినా ఇరవయ్యయిదేళ్లవాడిలా కష్టపడతావని, ప్రొఫెషనలిజంకి పెద్దపీట వేస్తావనీ కాదూ..
కథానాయకుడిగానే కాదు కష్టకాలంలో ఇండస్ట్రీకి నాయకుడిగా బై ఎగ్జాంపుల్ ముందుండి నడిపిస్తావని కాదూ..
ఇందుక్కాదూ మెగాస్టారయింది నువ్వు..
ఆచార్యా.. టేకెబౌ..''