మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : గురువారం, 11 నవంబరు 2021 (12:03 IST)

నేడు చిత్తూరు జిల్లాలో సెలవు

బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. గత కొన్నిరోజులుగా నెల్లూరు జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.

వాయుగుండం ప్రభావంతో తాజాగా చిత్తూరు జిల్లాలోనూ విస్తారంగా వానలు పడుతున్నాయి. దాంతో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు జల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్ ఓ ప్రకటన చేశారు.
 
కాగా, వాయుగుండం ఈ సాయంత్రం కారైక్కల్, శ్రీహరికోట మధ్య కడలూరు వద్ద తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. బంగాళాఖాతంలో వాయుగుండం, దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం, వీటికి తోడు ఈశాన్య రుతుపవనాల కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
 
భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హెచ్చరికల నేపథ్యంలో నెల్లూరు, చిత్తూరు జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. నెల్లూరు జిల్లాలో తీర ప్రాంత గ్రామాల్లో పర్యటించి అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చక్రధర్ బాబు అధికారులకు స్పష్టం చేశారు. అవసరమైన పక్షంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా రెవెన్యూ అధికారి బి.చిన్నఓబులేసు ఆదేశాలు జారీ చేశారు.
 
అటు, ఈ నెల 13వ తేదీన అండమాన్ సముద్రం పరిసరాల్లో మరో అల్పపీడనం ఏర్పడనుందని, ఇది బంగాళాఖాతంలో ప్రవేశించి పశ్చిమ వాయవ్య దిశగా ఏపీకి సమీపంలోకి వస్తుందని ప్రైవేటు వాతావరణ సంస్థలు అంచనా వేస్తున్నాయి.