శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 20 ఆగస్టు 2020 (10:10 IST)

భాగ్యనగరికి ఏమైంది? ... హైదరాబాద్‌లో 6.6 లక్షల మందికి కరోనా వచ్చి వెళ్లిపోయిందా?

తెలంగాణ రాష్ట్ర రాజధానిగా ఉన్న హైదాబాద్ నగరాన్ని కరోనా వైరస్ కబళించినట్టుగా తెలుస్తోంది. కేవలం మనుషుల ద్వారానే కాకుండా, మురుగు నీటి ద్వారా కూడా ఈ వైరస్ వ్యాపిస్తున్నట్టు తాజాగా నిర్వహించి ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఫలితంగా భాగ్యనగరిలో నివసించే జనాభాలో ఏకంగా 6.6 లక్షల మందికి ఈ వైరస్ సోకి వెళ్లిపోయిందని పరిశోధకులు చెబుతున్నారు. 
 
హైదరాబాద్‌ నగరంలో కోవిడ్‌ కేసుల సంఖ్యపై సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ), ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐఐసీటీ) ఓ అధ్యయనం జరిగింది. ఈ పరిశోధనలో ఓ ఆసక్తికరమైన, ఒకింత ఆశ్చర్యానికి గురిచేసే విషయాలు వెలుగు చూశాయి. 
 
నగరంలోని మురుగునీటి శుద్ధి కేంద్రాల నుంచి మానవ వ్యర్థాలు, నీటి నమూనాలు సేకరించి విశ్లేషించారు. దాదాపు 2 లక్షల మందికిపైగా ఈ వైరస్‌ బారిన పడ్డట్టు గుర్తించారు. అయితే, నగర జనాభా ద్వారా విసర్జితమయ్యే మురుగులో 40 శాతం మాత్రమే శుద్ధి కేంద్రాలకు చేరుతోంది కాబట్టి.. మిగిలిన మురుగునూ లెక్కలోకి తీసుకుంటే సుమారు 6.6 లక్షల మందిలో వైరస్‌ ఉంటుందని అంచనా వేశారు. 
 
వీరిలో ఇప్పటికే అధికశాతం మంది వైరస్‌ నుంచి కోలుకున్నారని, ప్రస్తుతం కొద్ది శాతం మాత్రమే యాక్టివ్‌ కేసులు ఉన్నాయని పరిశోధకులు పేర్కొన్నారు. అదేసమయంలో మురుగునీటి ద్వారా వైరస్‌ ఇతరులకు వ్యాపించే అవకాశం లేదని ఈ పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. దీంతో భాగ్యనగరి వాసులు ఊపిరి పీల్చుకున్నారు.
 
తెలంగాణాలో కరోనా తాజా అప్‌డేట్స్ 
తెలంగాణలో కొవిడ్ కేసుల విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ గురువారం ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో కొత్తగా  23,841 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 1724 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. అదేసమయంలో 10 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 1195 మంది కోలుకున్నారు.  
 
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 97,424కు చేరింది. ఆసుపత్రుల్లో 21,509 మందికి చికిత్స అందుతోంది. ఇప్పటివరకు 75,186 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 729కు చేరింది. జీహెచ్‌ఎంసీలో 395 మందికి కొత్తగా కరోనా సోకింది. తెలంగాణలో మొత్తం 8,21,311మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.