మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 27 అక్టోబరు 2020 (10:44 IST)

నేడే వైయస్సార్‌ రైతు భరోసా సహాయం

మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం పలు పథకాలతో క్యాలెండర్‌ అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా మరో రెండు అడుగులు ముందుకు వేసింది.

రాష్ట్ర వ్యవసాయ రంగంలో సువర్ణ అధ్యాయంగా నిల్చే విధంగా రైతులకు వరసగా రెండో ఏడాది కూడా పెట్టుబడి సహాయం చేస్తోంది. ఎన్నికల ప్రణాళికలో చెప్పిన  దానికంటే ముందుగా, ఇస్తామన్న దానికంటే మిన్నగా ‘వైయస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌’ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. 
 
అది ఎలా?:
అధికారం చేపట్టిన తర్వాత రెండో ఏడాది నుంచి రైతులకు పెట్టుబడి సాయంగా ఏటా రూ.12,500 చొప్పున నాలుగేళ్లు ఇవ్వాలని అనుకున్నా, రైతులకు మరింత మేలు చేసేందుకు పెట్టుబడి సహాయం 4 ఏళ్లకు బదులుగా 5 ఏళ్లు, ఏటా రూ.12,500 బదులుగా వేయి రూపాయలు పెంచి ఏటా రూ.13,500 చొప్పున ఇవ్వాలని సీఎం వైయస్‌ జగన్‌ నిర్ణయించారు. దీని వల్ల ప్రతి రైతు కుటుంబానికి 5 ఏళ్లలో రూ.67,500 ఆర్థిక సహాయం అందుతుంది.
 
వరుసగా రెండో ఏడూ..:
ఏటా రైతులకు పెట్టుబడి సహాయంగా ఇస్తున్న రూ.13,500ను వరసగా రెండో ఏడాది కూడా ప్రభుత్వం పక్కాగా అమలు చేస్తోంది. తొలి విడతగా ఇప్పటికే ఖరీఫ్‌ సీజన్‌ ఆరంభంలో మే 15వ తేదీన పెట్టుబడి సహాయం చేసిన ప్రభుత్వం, ఇప్పుడు రెండో విడత సహాయం అందిస్తోంది.  
 
ఎందరు రైతులు? ఎంత మొత్తం?
సాగు పెట్టుబడి కోసం రైతులు ఏ మాత్రం ఇబ్బంది పడకుండా వారికి నేరుగా ఆర్థిక సహాయం చేసే ‘వైయస్సార్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌’ పథకంలో రెండో ఏడాది, రెండో విడతను మంగళవారం నాడు క్యాంప్‌ కార్యాలయంలో కంప్యూటర్‌లో బటన్‌ నొక్కడం ద్వారా సీఎం వైయస్‌ జగన్‌ రైతులకు అందజేస్తున్నారు. రాష్ట్రంలో 50.47 లక్షల రైతు కుటుంబాల ఖాతాల్లో మొత్తం రూ.1,115 కోట్లు జమ చేయనున్నారు.

వైయస్సార్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌ కింద మొత్తం రూ.6,797 కోట్లు రైతులకు పెట్టుబడి సహాయంగా ఇస్తున్నారు. తుది విడత మొత్తాన్ని పంటలు చేతి కొచ్చే సమయం, అంటే వచ్చే ఏడాది సంక్రాంతి పండగ సందర్భంగా రైతుల ఖాతాల్లో జమ చేస్తారు.
 
హెల్ప్‌లైన్‌:
ఈ సొమ్మును బ్యాంకులు పాత బాకీల కింద జమ చేసుకోకుండా, రైతుల అన్‌ ఇన్‌కమ్‌బర్డ్‌ ఖాతాల్లో జమ చేస్తున్నారు. అదే విధంగా రైతులకు ఏ సమస్య వచ్చినా సంప్రదించేందుకు 1902 హెల్ప్‌లైన్‌ నెంబర్‌ కూడా ఏర్పాటు చేశారు.
 
కౌలు, ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ రైతులకూ..:
కౌలు రైతులతో పాటు, ‘అటవీ హక్కు పత్రాలు’ (ఆర్‌ఓఎఫ్‌ఆర్‌) పొంది సాగుకు సిద్ధమైన గిరిజన రైతులకు కూడా వైయస్సార్‌ రైతు భరోసా పథకం వర్తింప చేస్తున్నారు. ఖరీఫ్‌ ఆరంభంలో ఇచ్చే రూ.7500తో పాటు, మలి విడతగా రబీ సీజన్‌ ఆరంభంలో ఇచ్చే రూ.4 వేలు కూడా కలిపి వారికి ఒకేసారి రూ.11,500 అందిస్తున్నారు. ఆ విధంగా మొత్తం 1.02 లక్షలకు పైగా రైతులకు దాదాపు రూ.118 కోట్లు జమ చేస్తున్నారు. 
 
దేశంలో ఎక్కడా లేని విధంగా రైతన్నలకు రూ.13,500 ఇవ్వడమే కాకుండా కౌలు రైతులు, అటవీ, అసైన్డ్‌ భూముల సాగు చేసుకుంటున్న రైతులకు కూడా వైయస్సార్‌ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం.
 
ఇన్‌పుట్‌ సబ్సిడీ:
మరోవైపు రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఒక సీజన్‌ ఇన్‌పుట్‌ సబ్సిడీని అదే (సేమ్‌) సీజన్‌లో ఇస్తున్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో జూన్‌ నుంచి సెప్టెంబరు వరకు  వర్షాలు, వరదల వల్ల పంట నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ (పెట్టుబడి సహాయం) ఇస్తున్నారు. ఆ మేరకు 1.43 లక్షల రైతులకు మొత్తం రూ.145 కోట్ల పెట్టుబడి సహాయాన్ని నేరుగా వారి ఖాతాల్లో జమ చేయనున్నారు.

ఈ నెల (అక్టోబరు)లో సంభవించిన భారీ వర్షాలు, వరదల వల్ల పంటలకు కలిగిన నష్టంపై అంచనాలు సిద్ధమవుతున్నాయి. ఆ లెక్కలు పూర్తి కాగానే, రబీ సాగులో అవసరాలకు ఉపయోగపడేలా నవంబరు నెలలోనే ఇన్‌పుట్‌ సబ్సిడీ అందజేస్తారు.