గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 17 ఫిబ్రవరి 2020 (21:03 IST)

రేపు 56.88 లక్షల మందికి కంటివైద్య పరీక్షలు

ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల్లో మరో అడుగు ముందుకు పడుతోంది. ప్రస్తుతం 1 శాతం ఉన్న అంధత్వాన్ని 0.3 శాతానికి తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన వైయస్సార్‌ కంటి వెలుగులో మూడో విడత కార్యక్రమం ప్రారంభంకానుంది.

ఇప్పటి వరకు రెండు విడతల్లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు కంటి వైద్య పరీక్షలు నిర్వహించిన ప్రభుత్వం, ఇప్పుడు అవ్వాతాతలపై దృష్టి పెట్టింది. కర్నూలు వేదికగా మంగళవారం(18-02-2020) నాడు వైయస్సార్‌ కంటి వెలుగు మూడో విడతను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించనున్నారు.  
 
అవ్వాతాతలు
అవ్వాతాతలకు ప్రాధాన్యం ఇస్తూ, ఈ విడతలో వారికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వైయస్సార్‌ కంటి వెలుగు మూడో విడతలో 60 ఏళ్లు, ఆ పైబడిన మొత్తం 56,88,424 మంది అవ్వాతాతలకు స్క్రీనింగ్‌ (కంటి వైద్య పరీక్షలు) చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

జూలై 31 వరకు మూడో విడత కంటి వెలుగు కార్యక్రమం కొనసాగనుంది. కంటి స్క్రీనింగ్‌ అనంతరం అవసరమైన వారికి కళ్లద్దాలతో పాటు, అవ్వాతాతలకు పింఛన్లు కూడా పంపిణీ చేయనున్నారు. వాలంటీర్లు నేరుగా అవ్వాతాతల ఇళ్లకు వెళ్లి వారికి స్వయంగా కళ్లద్దాలు అందజేస్తారు. 
 
ప్రత్యేక వైద్య బృందాలు
కంటి వైద్య పరీక్షల్లో చూపు సమస్యలు గుర్తించిన వారికి వచ్చే నెల నుంచి శస్త్ర చికిత్సలు చేస్తారు. గ్రామ సచివాలయాల్లోనే అవ్వాతాతలకు స్క్రీనింగ్‌ జరుగుతుంది. ఇందు కోసం ప్రతి మండలానికి 2 నుంచి 3 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడంతో పాటు, తగిన రూట్‌ మ్యాప్‌లు కూడా సిద్ధం చేస్తున్నారు.

ఈ బృందాలలో వైద్యులతో పాటు, ఆశా వర్కర్లు, గ్రామ సచివాలయాల ఏఎన్‌ఎంలు, సబ్‌ సెంటర్ల ఏఎన్‌ఎంలు, పారా మెడికల్‌ సిబ్బంది ఉన్నారు.
 
వైయస్సార్‌ కంటి వెలుగు మూడో విడత కార్యక్రమాన్ని జిల్లాల కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ చూపి విజయవంతం చేయాలన్న సీఎం వైయస్‌ జగన్, అవసరమైతే నియోజకవర్గాల వారీగా కూడా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. 
 
వైయస్సార్‌ కంటి వెలుగు
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5.30 కోట్ల మందికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించడం కోసం వైయస్సార్‌ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది.

రూ.560 కోట్ల వ్యయంతో జనవరి 31, 2022 నాటికి, మొత్తం ఆరు దశల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. 1శాతం ఉన్న అంధత్వాన్ని 0.3 శాతానికి తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
 
ఇప్పటి వరకు..
వైయస్సార్‌ కంటి వెలుగు తొలి విడత కార్యక్రమం గత ఏడాది అక్టోబరు 10 నుంచి 16వ తేదీ వరకు నిర్వహించారు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటుకు చెందిన 60,401 పాఠశాలల్లో 66,15,467 మంది విద్యార్థినీ, విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించగా, వారిలో 4,36,979 మంది విద్యార్థులకు కంటి సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. ఈ కార్యక్రమంలో 60 వేల మంది సుశిక్షితులైన సిబ్బంది పాల్గొన్నారు.
 
రెండో విడత
ఆ తర్వాత రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం గత ఏడాది నవంబరు 1వ తేదీ నుంచి డిసెంబరు 31 వరకు కొనసాగింది. తొలి విడతలో కంటి సమస్యలు గుర్తించిన 4,36,979 మంది విద్యార్థినీ విద్యార్థులలో 4,35,379 మందికి తిరిగి స్క్రీనింగ్‌ (రెండోసారి పరీక్షలు) చేశారు. ప్రభుత్వంతో పాటు, వివిధ స్వచ్ఛంద సంస్థలకు చెందిన సుశిక్షితులైన 500 బృందాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి.
 
కంటి వైద్య పరీక్షలు నిర్వహించిన విద్యార్థినీ, విద్యార్థులలో 2,40,997 మందికి వైద్య సలహాలు ఇవ్వడంతో పాటు, అవసరమైన వారికి ఔషథాలు పంపిణీ చేశారు. 1,52,779 మంది విద్యార్థులకు కళ్లద్దాలు ఇవ్వాలని సూచించిన (ప్రిస్క్రైబ్‌ చేసిన) వైద్యులు మరో 46,286 మంది విద్యార్థులకు మూడోసారి వైద్య పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు.

వారిలో 2177 మంది విద్యార్థులకు శస్త్రచికిత్స అవసరమని ప్రాథమికంగా గుర్తించారు. రెండో విడత కంటి వెలుగు కార్యక్రమంలో వైద్యులు ప్రిస్క్రైబ్‌ చేసిన విద్యార్థులలో 1,34,252 మంది విద్యార్థినీ విద్యార్థులకు కళ్లద్దాలు ఇవ్వాల్సి ఉండగా, ఈనెల 15వ తేదీ నాటికి 56,767 పంపిణీ చేశారు. మరో 77,485 కళ్లద్దాల పంపిణీ ప్రక్రియ కొనసాగుతోంది.
 
ఆస్పత్రులు: నాడు–నేడు
అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాలను కార్పొరేట్‌ ఆస్పత్రులతో సమానంగా అప్‌గ్రేడ్‌ చేయడమే లక్ష్యంగా ‘ఆస్పత్రులు: నాడు–నేడు’ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రస్తుత ఆస్పత్రుల బలోపేతం, అవసరమైన చోట్ల మరమ్మతులు, కొత్త ఆస్పత్రుల నిర్మాణం, ఆస్పత్రులలో అన్ని సదుపాయాలు కల్పిస్తారు.

రూ.11,737 కోట్ల వ్యయంతో మూడేళ్లలో దశల వారీగా ఈ కార్యక్రమం చేపడతారు. అన్ని ప్రభుత్వ ఆçస్పత్రులలో ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను మెరుగుపరచడం, మెరుగైన సేవలను అందించడమే లక్ష్యంగా ముందడుగు వేస్తున్నారు. 
 
తొలి దశ
ఆస్పత్రులు:నాడు–నేడు తొలి దశలో రూ.1,129 కోట్ల వ్యయంతో 7,548 ఆరోగ్య–సంరక్షణ కేంద్రాలు (ఉప కేంద్రాలు) ఏర్పాటు చేయనున్నారు. వాటిలో 1086 ఉప కేంద్రాలు ప్రభుత్వ భవనాలలో ఉండగా, మరో 1084 కేంద్రాలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీ)తో కలిసి ఉన్నాయి.

ఈ నేపథ్యంలో ఒక్కోటి రూ.23 లక్షల వ్యయంతో కొత్తగా 4906 ఉప కేంద్రాలు నిర్మించనున్నారు. 888 చదరపు అడుగుల విస్తీర్ణంలో సింగిల్‌ బెడ్‌ రూమ్, కిచెన్, టాయిలెట్‌తో కూడిన స్టాఫ్‌ క్వార్టర్, టాయిలెట్‌తో కూడిన ల్యాబ్, పరీక్షా గది, క్లినిక్‌. పూర్తిగా అమర్చిన వైద్య సామగ్రి అవసరమైన ఫర్నీచర్‌ ఉప కేంద్రాలలో ఉంటాయి. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.1,129 కోట్లు.
 
రెండో దశ
ఆస్పత్రులు:నాడు–నేడు రెండో దశలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీ), కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాల (సీహెచ్‌సీ)తో పాటు, ఏరియా ఆస్పత్రుల (ఏహెచ్‌)ను బలోపేతం చేస్తారు. ఇంకా అవసరమైన చోట్ల కొత్తవి ఏర్పాటు చేస్తారు. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.1,907 కోట్లు. 
 
మూడవ దశ
ఆస్పత్రులు:నాడు–నేడు మూడవ దశలో జిల్లా ఆస్పత్రులను బలోపేతం చేయడంతో పాటు, బోధనా ఆస్పత్రులు, కొత్తగా ప్రత్యేక ఆస్పత్రులు, వైద్య కళాశాలలు, నర్సింగ్‌ కళాశాలలు ఏర్పాటు చేస్తారు. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.8,701 కోట్లు.

విజయనగరం, ఏలూరు, పాడేరు, గురజాల, మార్కాపురం, పులివెందుల, మచిలీపట్నంలో కొత్తగా 7 వైద్య కళాశాలలు, కడపలో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి, మార్కాపురం, పలాసలో కిడ్నీ పరిశోధనా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.

ఇంకా..
ప్రతి మండలానికి ఒక 108 అంబులెన్స్‌. రూ.104.38 కోట్ల వ్యయంతో కొత్తగా 432 అంబులెన్స్‌లు (108 సర్వీసులు), అదే విధంగా 104 సర్వీసుల (మొబైల్‌ మెడికల్‌ యూనిట్లు) సేవలు అందుబాటులోకి రానున్నాయి.
 
వీటన్నింటితో కూడిన ‘ఆస్పత్రులు:నాడు–నేడు’ కార్యక్రమాన్ని కూడా సీఎం వైయస్‌ జగన్‌ మంగళవారం కర్నూలులో ప్రారంభించనున్నారు. వైయస్సార్‌ కంటి వెలుగు మూడో విడతను ప్రారంభించిన వేదిక వద్దనే ఆయన ‘ఆస్పత్రులు:నాడు–నేడు’ కు సంబంధించిన శిలాఫలకాలు ఆవిష్కరిస్తారు.  
 
ఆరోగ్యశ్రీ స్మార్ట్‌ హెల్త్‌ కార్డులు 
రూ.1000 ఖర్చు దాటిన ప్రతి చికిత్సకు ఆరోగ్యశ్రీ వర్తింప చేయడంతో పాటు, రూ.5 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న వారందరికీ ఆరోగ్యశ్రీ హెల్త్‌ కార్డులు అందిస్తామన్న ప్రభుత్వం ఆ దిశలో ముందుకు సాగుతోంది.

ఆ మేరకు డాక్టర్‌ వైయస్సార్‌ ఆరోగ్యశ్రీ స్మార్ట్‌ హెల్త్‌ కార్డులను కూడా సీఎం వైయస్‌ జగన్‌ మంగళవారం కర్నూలు సభలో లబ్ధిదారులకు అందజేస్తారు. రోగికి సంబంధించిన అన్ని వివరాలు ఆ కార్డులో నిక్షిప్తమై ఉంటాయి.