శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 5 మే 2020 (21:41 IST)

రేపు వైయస్సార్‌ మత్స్యకార భరోసా పథకం చెల్లింపులు

అధికారం చేపట్టిన నాటి నుంచి అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం అనేక పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్న ప్రభుత్వం ఆ దిశలో మరో ముందడుగు వేసింది. సముద్రంలో చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులకుఇచ్చే పరిహారాన్ని రూ.10 వేలకు పెంచడంతో పాటు, గత ఏడాది మత్స్యకార దినోత్సవం రోజు ఆ మొత్తం చెల్లించగా, ఈసారి మే నెలలోనే వారికి ఆర్థిక సహాయం చేస్తోంది.

లక్షకు పైగా మత్స్యకార కుటుంబాలకు బుధవారం నాడు రూ.10 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించనుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా మే నెలలోనే ఈ సహాయం చేయడం ఒక విశేషం కాగా, దేశమంతా లాక్‌డౌన్‌ పరిస్థితి నేపథ్యంలో, ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఉన్నా, సముద్రాన్నే నమ్ముకుని జీవిస్తున్న మత్స్యకారులకు అండగా ఉంటూ, వారికి ఆర్థికంగా భరోసా ఇస్తూ, వైయస్సార్‌ మత్స్యకార భరోసా పథకాన్ని ప్రభుత్వం ఈ ఏడాది మే నెలలోనే అమలు చేస్తోంది. 
 
ఎవరెవరికి?
సముద్రంలో రెండు నెలల పాటు చేపల వేట నిషేధ సమయంలో గతంలో మత్స్యకార కుటుంబాలకు 2018 వరకు రూ.4 వేల చొప్పున సహాయం చేయగా, ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ మేరకు వైయస్సార్‌సీపీ ప్రభుత్వం ఆ మొత్తాన్ని రూ.10 వేలకు పెంచింది.

అంతే కాకుండా 2018 వరకు వరకు మర పడవల్లో చేపల వేటకు వెళ్లే వారికి మాత్రమే ఆ సహాయం అందగా, 2019 నుంచి దేశీయ నాటు, తెడ్డు, తెరచాప సహాయంతో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులకు కూడా రూ.10 వేలు చెల్లిస్తున్నారు. గత ఏడాది నవంబరు 21న మత్స్యకార దినోత్సవం రోజున ఆ సహాయం అందించగా, ఈసారి 6 నెలల ముందుగానే,  బుధవారం మత్స్యకారుల బ్యాంక్‌ ఖాతాల్లోకే నేరుగా నగదు బదిలీ ద్వారా రూ.10 వేల చొప్పున జమ చేస్తున్నారు. 
 
ఇంకా ఏమేం చేశారు?
డీజిల్‌పై సబ్సిడీ పెంపు. తక్షణమే చెల్లింపు:
మత్స్యకారులకు అండగా నిలుస్తూ ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టింది. చేపల వేట కోసం మత్స్యకారులు వినియోగించే పడవలకు 2019 వరకు లీటరు డీజిల్‌పై రూ.6.03 గా ఉన్న సబ్సిడీని రూ.9 కి పెంచడంతో పాటు, ఆ రాయితీ తక్షణమే అందిస్తున్నారు. డీజిల్‌ కొనుగోలు చేసిన వెంటనే స్మార్ట్‌కార్డుల ద్వారా ఆ రాయితీని బంకు యజమానులకు చెల్లించేలా ఏర్పాటు చేశారు.

మత్స్యశాఖకుచెందిన 6 డీజిల్‌ బంకులతో పాటు, ప్రభుత్వం గుర్తించిన 68 ప్రైవేటు బంకుల్లో ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. మెకనైజ్డ్‌ బోట్లకు నెలకు 3 వేల లీటర్లు, మోటరైజ్డ్‌ బోట్లకు నెలకు 300 లీటర్ల వరకు ఈ సబ్సిడీ వర్తిస్తుండగా, చేపల వేటపై నిషేధం సమయంలో మినహా ఏటా మొత్తం 10 నెలల పాటు పథకం వర్తింప చేస్తున్నారు. 
 
రూ.10 లక్షల పరిహారం
సముద్రంలో వేటకు వెళ్లి ప్రమాదవశాత్తూ మత్స్యకారులు ఎవరైనా మరణిస్తే ఆ కుటుంబాలకు ఇచ్చే పరిహారం రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచారు. 
 
పాకిస్తాన్‌ చెర నుంచి
సముద్రంలో తమ జలాల్లోకి ప్రవేశించారంటూ రాష్ట్రానికి చెందిన 22 మంది మత్స్యకారులను పాకిస్తాన్‌ భద్రతా బలగాలు 2018 నవంబరులో అరెస్టు చేశాయి. వారిలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారు 15 మంది, విజయనగరం జిల్లాకు చెందిన వారు 5గురు, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఇద్దరు ఉన్నారు.

వారిని విడిపించేందుకు చిత్తశుద్ధితో కృషి చేసిన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలను కలిసి ఒత్తిడి తీసుకువచ్చింది. ఫలితంగా ఆ మత్స్యకారులంతా పాక్‌ జైలు నుంచి సురక్షితంగా విడుదలయ్యారు. స్వయంగా వాఘా సరిహద్దుకు వెళ్లిన మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ ఆ మత్స్యకారులకు స్వాగతం పలికి రాష్ట్రానికి తీసుకు వచ్చారు. వారందరిని వారి స్వస్థలాలకు పంపడంతో పాటు, ఒక్కొక్కరికి జీవన ఉపాధి కోసం రూ.5 లక్షల చొప్పున ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఆర్థిక సహాయాన్ని కూడా ప్రభుత్వం అందించింది.
 
కేంద్రం తరపున..
గుజరాత్‌ స్టేట్‌ పెట్రోలియమ్‌ కార్పొరేషన్‌ 2012లో సముద్రంలో జరిపిన డ్రిల్లింగ్‌ వల్ల తూర్పు గోదావరి జిల్లాలో 8 మండలాల్లోని 68 గ్రామాలకు చెందిన 5060 పడవలు చేపలవేటకు వెళ్లలేకపోయాయి. దీంతో 16,559 మంది మత్స్యకారులు జీవనభృతి కోల్పోయారు. 13 నెలల పాటు ఆ డ్రిల్లింగ్‌ జరగగా, జీఎస్‌పీఎస్‌ సంస్థ వారికి 6 నెలలకు గానూ రూ.68.88 కోట్లు చెల్లించింది. మిగిలిన 7 నెలలకు సంబంధించి రూ.70.53 కోట్లు ఇవ్వలేదు. 

అయితే ఆ సొమ్ము చెల్లిస్తానని పాదయాత్రలో ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న సీఎం వైయస్‌ జగన్, రూ.70.53 కోట్లు కేంద్రం నుంచి నిధులు రానప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి గత ఏడాది మత్స్యకార దినోత్సవం రోజున చెల్లించారు. 
 
4300 మంది మత్స్యకారుల తరలింపు
గుజరాత్‌ తీరం వెంట సముద్రంలో చేపలవేటకు వెళ్లిన రాష్ట్రానికి చెందిన 4300 మంది మత్స్యకారులు కరోనా తాకిడితో అక్కడే చిక్కుబడి పోగా, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడిన సీఎం శ్రీ వైయస్‌ జగన్, వారికి అక్కడ సౌకర్యాలు కల్పించడంతో పాటు, ఖర్చుకు వెనకాడకుండా ప్రత్యేక రవాణా సదుపాయం ద్వారా అందరినీ సురక్షితంగా ప్రత్యేక బస్సుల్లో రాష్ట్రానికి తీసుకువచ్చారు. 
 
ఫిష్‌ ల్యాండింగ్, ఫిషింగ్‌ హార్బర్లు
కోస్తా జిల్లాలలో దశల వారీగా ఫిష్‌ లాండింగ్‌ సదుపాయాలు మెరుగు పర్చడమే కాకుండా నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె, తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడ, ప్రకాశం జిల్లా ఓడరేవులో 3 కొత్త ఫిషింగ్‌ హార్బర్ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇప్పటికే ఉన్న నిజాంపట్నం, మచిలీపట్నం ఫిషింగ్‌ హార్బర్లను మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నారు.

శ్రీకాకుళం జిల్లా మంచినీళ్లపేటలో ఫిష్‌ లాండింగ్‌ సెంటర్‌ పనులకు శంకుస్థాపన కూడా చేశారు. నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణంలో కేంద్రం వాటాకు సంబంధించి రూ.144.40 కోట్లకు గానూ మొదటి విడతగా రూ.18 కోట్లు విడుదల అయ్యాయి. మరోవైపు  మత్స్యకారులకు అండగా నిల్చేందుకు 725 మంది గ్రామ మత్స్య సహాయకులను కూడా ప్రభుత్వం నియమించింది.
 
ఇప్పుడు లాక్‌డౌన్‌ పరిస్థితుల్లోనూ..
ఇప్పుడు దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న లాక్‌డౌన్‌తో రాష్ట్రం ఆర్థికంగా చాలా నష్టపోతోంది. ఒకవైపు ఆదాయం పూర్తిగా పడిపోగా, మరోవైపు కోవిడ్‌–19 నివారణ, నియంత్రణ కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తోంది.

అయినప్పటికీ చేపల వేట నిషేధ సమయంలో ఉపాధి కోల్పోయే మత్స్యకారులు ఇబ్బంది పడకూడదన్న లక్ష్యంతో, లక్షకు పైగా మత్స్యకార కుటుంబాలకు రూ.10 వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది.