ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 5 మే 2020 (21:22 IST)

కంటైన్మేంట్ లో ఎటువంటి మినహాయింపులు లేవు: గుంటూరు జిల్లా కలెక్టర్

గుంటూరు జిల్లాలో కరోనా వైరస్  పాజిటివ్ కేసులు నమోదైన సంఖ్యకు అనుగుణంగా  కేంద్ర ప్రభుత్వం గుంటూరు జిల్లాను రెడ్ జోన్ జిల్లాగా ప్రకటించిందని జిల్లా కలెక్టర్ ఐ శామ్యూల్ ఆనంద్ కుమార్ పేర్కొన్నారు.

మంగళవారం కలక్టరేట్ లోని ఎస్ ఆర్ శంకరన్ సమావేశ మందిరం వద్ద జిల్లా కలెక్టర్ ఐ శామ్యూల్ ఆనంద్ కుమార్, గుంటూరు అర్బన్ ఎస్పీ  పి హెచ్ డి రామకృష్ణ తో కలసి విలేఖరుల సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్  మాట్లాడుతూ,   కరోనా వైరస్ పాజిటివ్ కేసుల నమోదు సంఖ్య, రెట్టింపు అవుతున్న విధానం తదితర ప్రమాణాలను బట్టి కేంద్ర ప్రభుత్వం దేశంలోని జిల్లాలను రెడ్, గ్రీన్, ఆరంజ్ జోన్లను విభజించిందన్నారు.

ప్రకటించిన జోనును  బట్టి లాక్ డౌన్ అమలు జరిగే మే 17 వరకు కొన్ని మినహాయింపులు ప్రకటించడం జరిగిందన్నారు. పాజిటివ్ కేసు నమోదైన వ్యక్తి ఇంటి నుండి 500 మీటర్ల పరిధి వరకు కంటైన్మేంట్ క్లస్టరుగాను, అక్కడి నుండి మూడు కిలో మీటర్ల వరకు కంటైన్మేంట్ బఫర్ జోనుగాను వుంటుందన్నారు. కంటైన్మేంట్ క్లస్టర్, బఫర్ జోను కంటైన్మేంట్ ప్రాంతం క్రింద వుంటుందన్నారు. 

కంటైన్మేంట్ ప్రాంతంలో ఎటువంటి మినహాయింపులు లేకుండా లాక్ డౌన్ అమలు జరుగుతుందన్నారు.  కంటైన్మేంట్, బఫర్ జోనులో నిత్యావసర సరుకుల కోసం మాత్రమే ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు మినహాయింపు వుంటుందని, కంటైన్మేంట్ క్లస్టర్లలో మాత్రం నిత్యావసర సరుకులు ఇళ్ళ వద్దకే పంపించడం జరుగుతుందన్నారు.

జిల్లాలో నమోదైన పాజిటివ్ కేసులను బట్టి 59 కంటైన్మేంట్ క్లస్టర్లు, 20 కంటైన్మేంట్ జోన్లు ఉన్నాయన్నారు. జిల్లా రెడ్ జోనుగా ప్రకటించడం వలన కంటైన్మేంట్ జోన్లు మినహా అన్ని ప్రాంతాలు రెడ్ జోన్ పరిధిలో వుంటాయన్నారు.

గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్ ( చౌడవరం, పొత్తూరు  మినహా ) అచ్చంపేట, చిలకలూరిపేట మున్సిపాలిటి, దాచేపల్లి, ఈపూరు, కారంపూడి, కర్లపాలెం, క్రోసూరు, మాచర్ల మున్సిపాలిటి, మాచర్ల రూరల్, మంగళగిరి, మేడికొండూరు, నరసరావుపేట మున్సిపాలిటి, నరసరావుపేట రూరల్,నకరికల్లు, పెదకాకాని, పొన్నూరు, సత్తెనపల్లి రూరల్, తాడేపల్లి మునిసిపాలిటి  కంటైన్మేంట్ జోనులో ఉన్నాయన్నారు. 

వీటిలో నిత్యావసర వస్తువుల దుకాణాలకు ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు మినహాయింపు వుంటుందన్నారు.  రెడ్ జోన్లలో మాత్రం కొన్ని కార్యకలాపాలకు  షరతులతో కూడిన మినహాయింపులు  మంజూరు చేస్తూ కేంద్ర హోమ్ శాఖ నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు. కంటైన్మేంట్ జోన్లలో మద్యం షాపులు తెరవడానికి అనుమతి లేదని, రెడ్ జోన్లలో సైతం సామాజిక దూరం పాటిస్తూ, ఒకేసారి ఐదుగురు వ్యక్తులను మాత్రమే మద్యం కొనుగోలుకు అనుమతిస్తామన్నారు. 

జిల్లాలో 280 మద్యం షాపులు వుండగా, రెడ్ జోన్ పరిధిలో 134 మద్యం షాపులు మాత్రమే తెరవడం జరిగిందన్నారు. వైన్ షాపు వద్ద భారీ సంఖ్యలో ప్రజలు గుమిగుడితే వెంటనే షాపు మూసివేయడం జరుగుతుందన్నారు.  జిల్లాను రెడ్ జోన్ గా ప్రకటించడం వలన ప్రతి ఒక్కరు సామాజిక దూరం పాటించాలని, వెలుపలకు వచ్చేటప్పుడు మాస్కులు ధరించాలని తెలిపారు.

కంటైన్మేంట్ ప్రాంతాలలో చివరి పాజిటివ్ కేసు నమోదు అయిన వ్యక్తి  ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన 28 రోజుల తరువాత మాత్రమే లాక్ డౌన్ తొలగించడం జరుగుతుందన్నారు.   జిల్లాలో  త్రాగునీటికి ఇబ్బందులు లేకుండా చెరువులు నింపడానికి చర్యలు తీసుకుంటున్నామని, బోర్లు, నీటి వనరులు లేని 24 ప్రాంతాలలో ట్యాంకర్ల ద్వారా మంచినీటి సరఫరాకు అనుమతులు మంజూరు చేశామన్నారు. 

ప్రస్తుతం నమోదు అవుతున్న పాజిటివ్ కేసులన్నీ కంటైన్మేంట్ ప్రాంతాలలోనే నమోదు అవుతున్నాయని, కరోనా వైరస్ ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందడం లేదన్నారు.  గుంటూరు అర్బన్ ఎస్పీ పి హెచ్ డి రామకృష్ణ మాట్లాడుతూ, గుంటూరు నగరం మొత్తం కంటైన్మేంట్ జోన్ పరిధిలో వుందని, ఇక్కడ లాక్ డౌన్ పూర్తిగా అమలు జరుగుతున్నదన్నారు.

కంటైన్మేంట్ క్లస్టర్లు, జోన్ మొత్తం బారికేడింగ్ చేసి రాకపోకలను నియంత్రిస్తున్నామన్నారు.  గుంటూరు అర్బన్ పోలీసు పరిధిలో కంటైన్మేంట్ ప్రాంతాలు లేని వడ్లమూడి, ప్రత్తిపాడులోనే  మద్యం దుకాణాలు తెరవడం జరిగిందన్నారు.  ఎక్కడి వారు అక్కడే మద్యం  కొనుగోలు చేయాలని, కంటైన్మేంట్ ప్రాంతాల వారు  ఇతర ప్రాంతాలలోని మద్యం దుకాణాలకు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

నిబంధనలు ఉల్లంఘించి మద్యం కొనుగోలుకు ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారిని గుర్తించి కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. అదే విధంగా లాక్ డౌన్ సమయంలో జారీ చేసిన పాసులను దుర్వినియోగపరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. 

సంయుక్త కలెక్టర్ ఏ ఎస్ దినేష్ కుమార్ మాట్లాడుతూ, లాక్ డౌన్ వలన జిల్లాలో నిలిచిపోయిన వలస కార్మికులు, విద్యార్దులు, పర్యాటకులు వారి స్వస్థలాలకు వెళ్లేందుకు స్పందన వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆన్ లైన్ పై అవగాహన లేని వారు 1902 కు ఫోన్ చేసి లేదా స్థానిక తహశీల్దారు కార్యాలయం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. 

అదే విధంగా ఇతర ప్రాంతాలలో నిలిచిపోయిన ఈ జిల్లాకు చెందిన వలస కార్మికులు, విద్యార్దులు, పర్యాటకులు కూడా ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.  వీరి దరఖాస్తులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి ఈ – పాసులు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. 

ఇతర రాష్ట్రాలకు వెళ్ళే వారి వివరాలను సంబంధిత రాష్ట్రాలకు పంపించి, అక్కడి స్థానిక అధికారులు అనుమతించిన వెంటనే వీరిని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తామని, దీని కోసం 4 లేదా 5 రోజుల సమయం పడుతుందన్నారు. దరఖాస్తు చేసుకున్న వారికి అనుమతి వస్తేనే బయలుదేరాలన్నారు.

జిల్లాకు రావడానికి ఇప్పటి వరకు 9492 మంది ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారని, వీటిని పరిశీలించి అనుమతులు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.