ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 30 ఏప్రియల్ 2020 (20:37 IST)

ఆ రెండు జోన్లలో కంటైన్మెంట్ విధానాన్ని కట్టుదిట్టంగా అమలు చేయండి: కేంద్రం

రెడ్ మరియు ఆరెంజ్ జోన్లలో కంటైన్మెంట్ విధానాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ఆదేశించారు.

కరోనా నియంత్రణ చర్యలపై గురువారం ఢిల్లీ నుండి ఆయన వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, కేంద్ర పాలిత ప్రాంతాల అడ్మినిస్ట్రేటర్లతో వీడియో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా రాజీవ్ గౌబ మాట్లాడుతూ.. ముఖ్యంగా కొవిడ్-19 పరిస్థితి మరియు కంటైన్మెంట్ ప్రణాళికల అమలు ఆధారంగా జిల్లాలను రెడ్, ఆరెంజ్, గ్రీన్ జిల్లాలుగా విభజన అజెండాగా ఈ వీడియో సమావేశం నిర్వహించారు. మే 3వరకూ లాక్‌డౌన్ నిబంధనలను పటిష్టంగా అమలు చేయాలన్నారు.

వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న వారిని స్వస్థలాలకు చేర్చేందుకు హోం శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను తుచా తప్పక పాటించాలని సిఎస్‌లను ఆదేశించారు. కరోనా అనుమానిత లక్షణాలు ఉన్న వారిని గుర్తించే ప్రక్రియ విస్తృతంగా జరగాలని చెప్పారు.

దేశవ్యాప్తంగా సరుకు రవాణా వాహనాలకు అనుమతించినందుకు వాటి విషయంలో ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలని స్పష్టం చేశారు. కంటైన్మెంట్ జోన్ల లో లాక్ డౌన్ నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేయాలని సిఎస్ లకు స్పష్టం చేశారు. అదే విధంగా గ్రామీణ ప్రాంతాల్లోని గ్రీన్ జోన్లలో ఆర్థిక కార్యకలాపాలు పెద్ద ఎత్తున ప్రారంభం అయ్యేలా చూడాలని కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ చెప్పారు.

21 రోజుల వ్యవధిలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు నమోదు కాకుంటే ఆలాంటి జిల్లాను గ్రీన్ జిల్లాగా గుర్తించి ఆర్థిక కార్యకలాపాలు పూర్తి స్థాయిలో ప్రారంభం అయ్యేలా చూడాల్సిన అవసరం ఉందన్నారు.

అదే విధంగా నమోదవుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య, పరీక్షల నిర్వహణ,కేసులు రెట్టింపు అవుతుండడం, సర్వే లెన్స్ ప్రక్రియ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఆరెంజ్,రెడ్ జిల్లాలుగా వర్గీకరణ చేయాల్సి ఉందని దానిపై రాష్ట్రాలు వివరాలు సూచనలు ఇవ్వాలని వాటిని బట్టి ఆరెంజ్,రెడ్ జిల్లాల విభజనపై మార్గదర్శకాలను జారీ చేయడం జరుగుతుందని కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ పేర్కొన్నారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని మాట్లాడుతూ ప్రస్తుతం వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుంటే  రాష్ట్రంలో 4 జిల్లాలు రెడ్ జిల్లాలుగాను,8 జిల్లాలు ఆరెంజ్ జిల్లాలు కేటగిరీ,ఒక జిల్లా గ్రీన్ జిల్లా కేటగిరీ కిందకు వస్తాయన్నారు.

మే 3 వరకూ లాక్ డౌన్ నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని సిఎస్ రాజీవ్ గౌబకు వివరించారు. వీడియో సమావేశంలో సిఆర్డిఏ అదనపు కమీషనర్ విజయకృష్ణన్ తదితరులు పాల్గొన్నారు.