కొండపల్లి కొత్త మున్సిపాలిటీలో ప్రశాంతంగా పోలింగ్
విజయవాడ శివారు కొండపల్లి మున్సిపల్ ఎన్నికలకు పోలింగ్ జోరుగా సాగింది. తొలిసారిగా ఇక్కడ మున్సిపల్ ఎన్నికలు జరుగుతుండటంతో ఓటర్లు ఎంతో ఉత్సాహంగా పోలింగ్ లో పాల్గొంటున్నారు. ఇక్కడి 29 వార్డులకు పోలింగ్ జరగుతుండగా, బారులు తీరిన ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మధ్యాహ్నానికే 40 శాతం వరకు పోలింగ్ పూర్తయింది.
కొండపల్లిలోని గర్ల్స్ హైస్కూల్ లో పోలింగ్ సరళిని ఎన్నికల పరిశీలకుడు మురళీ రెడ్డి పరిశీలించారు. కీలకమైన కొండపల్లి మున్సిపల్ ఎన్నికలకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని, పోలింగ్ ప్రశాంతం అని విజయవాడ సీపీ వివరించారు. ఇక్కడ రాజకీయంగా పోటాపోటీగా ఎన్నికలు జరగుతుండటంతో ఒక ఏసీపీ, ఒక డీసీపీ ఆధ్వర్యంలో 800 మంది పోలీసులను బందోబస్తుకు ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తున్నామని విజయవాడ పోలీస్ కమిషనర్ బి.శ్రీనివాసులు చెప్పారు.
కొండపల్లి మున్సిపాలిటీని చేజిక్కించుకోవాలని ఒక పక్క వైసీపీ, మరో పక్క టీడీపీ పోటీపడుతున్నాయి. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కొండపల్లి మున్సిపాలిటీ విజయాన్ని సవాలుగా తీసుకున్నారు. తన అనుచరగణాన్ని ఈ మున్సిపాలిటీలో మోహరించి అభ్యర్థుల విజయానికి కృషి చేశారు. మరో పక్క మాజీ మంత్రి దేవినేని ఉమ కొండపల్లి విజయాన్ని తన వ్యక్తిగత ఇమేజ్ గా తీసుకోవడంతో ఈ ఎన్నికలు పోటాపోటీగా మారాయి. ఇక్కడ సిట్టింగ్ ఎంపీ విజయవాడ నుంచి కేశినేని నాని కూడా వచ్చి ప్రచారంలో పాల్గొన్నారు. కొండపల్లి మన్సిపాలిటీ మాదే అని టీడీపీ నాయకులు ధీమాగా చెపుతున్నారు. ,