1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజయవాడ , మంగళవారం, 26 అక్టోబరు 2021 (11:57 IST)

బీజేపీతో అంట‌కాగుతూ... స్టీల్ ప్లాంట్ పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉద్య‌మం!

జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వన్ క‌ల్యాణ్ ఈ నెల 31న విశాఖపట్నం వెళ్తున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న కార్మికులు, ఉద్యోగులకు సంఘీభావం ప్రకటిస్తారు. వారి ఆహ్వానం మేరకు పవన్ కల్యాణ్ విశాఖ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే ఉద్యమం ప్రారంభమైన తర్వాత స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మాట్లాడిన ఆయన ఆ తర్వాత సైలెంటయ్యారు. బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మేయాలనుకుంటోందని తెలిసిన తర్వాత గట్టిగా మద్దతు పలకలేకపోయారు. వివిధ పార్టీలు ప్రత్యక్షంగా ఉద్యమాల్లో పాల్గొన్నప్పటికీ జనసేన మాత్రం దూరంగా ఉంది. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ఉద్యమంలోకి దిగడం ఆసక్తికరకంగా మారింది. 
 
ఇటీవలి కాలంలో పవన్ కల్యాణ్ రాష్ట్రం విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాలను గ‌ట్టిగానే ప్రశ్నిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని పదే పదే తెరపైకి తెస్తున్నారు. కారణం ఏమిటో తెలియదు కానీ.. అక్కడ గెలిపించి ఉంటే వారి గొంతుకై ఉండేవాడిన‌ని ఓసారి చెప్పారు. అయితే బీజేపీతో పొత్తులో ఉండి స్టీల్ ప్లాంట్‌కు వ్యతిరేకంగా ఎందుకు పోరాటాన్ని కొత్తగా ప్రారంభించాలనుకుంటున్నారన్నదానిపై జనసేన వర్గాలకు క్లారిటీ లేదు. ఎందుకంటే ఇప్పటికే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం చేతులు దాటిపోయింది. అమ్మకం ప్రక్రియలో సగం పూర్తి చేశారు. ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు పోరాటాల్ని నమ్ముకోక అమ్మకానికి మద్దతిచ్చి.. లోపల ఓ మాట.. బయట ఓ మాట చెప్పే రాజకీయ పార్టీలకే కొమ్ము కాస్తూండటంతో ప్రజల్లోనూ వారి పోరాటంపై నమ్మకం సన్నగిల్లింది.
 
ఉద్యోగులకే లేనిది మనకెందుకన్నట్లుగా రాజకీయ పార్టీలు సైలెంట్ అయిపోయాయి. ఈ కారణంగా ఉద్యమం బలహీనపడింది. అయితే ఇప్పుడు పవన్ కల్యాణ్ వారికి మద్దతిచ్చేందుకు రంగంలోకి దిగుతున్నారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకించడం అంటే కేంద్రాన్ని వ్యతిరేకించడమే. అందుకే పవన్ స్ట్రాటజీపై అందరికీ కొత్త సందేహాలు ప్రారంభమయ్యాయి. బీజేపీకి దూరం జరగడానికి స్ట్రాటజిక్‌గా పవన్ కల్యాణ్ ముందుకెళ్తున్నారని అంటున్నారు.