అమరావతిలో టీటీడీ కార్యాలయం
టీటీడీలో నూతన సంప్రదాయానికి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శ్రీకారం చుట్టారు. తాడేపల్లి కేంద్రంగా టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి క్యాంపు కార్యాలయం ఉండనుంది. ఈ మేరకు టీటీడీ కార్యాలయం ఏర్పాటు విషయమై చైర్మన్ వైవీ.. అధికారులను ఆదేశించారు.
తాడేపల్లి ఆఫీసులో ఆరుగురు ఉద్యోగులను నియమించాలని సర్వీసెస్ డిప్యూటీ ఈఓను విజయవాడ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈఓ రాజేంద్రుడు కోరారు. చైర్మన్ ఆదేశాల మేరకు నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేసే పనిలో టీటీడీ అధికారులు నిమగ్నమయ్యారు. ఇదిలా ఉంటే.. 21మంది సిబ్బందితో ఇప్పటికే తిరుమలలో టీటీడీ చైర్మన్ ఆఫీసును వైవీ ప్రారంభించారు.
ఎలుగుబంటి దాడిలో గాయపడిన మహిళకు టిటిడి ఛైర్మన్ పరామర్శ...
తిరుమలలోని ఆకాశగంగ అటవీ ప్రాంతంలో సోమవారం ఎలుగుబంటి దాడిలో గాయపడి అశ్విని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విజయలక్ష్మిని టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి చరవాణిలో పరామర్శించారు.
గాయపడిన మహిళకు మెరుగైన వైద్యం అందించాలని అశ్విని వైద్యాధికారులను ఛైర్మన్ ఆదేశించారు. మహిళలు ఒంటరిగా అటవీ ప్రాంతంలోకి వెళ్లరాదని సూచించారు. ఈ విషయమై అధికారులు కూడా భక్తులకు తగిన సూచనలు చేయాలని కోరారు.
టిటిడి తిరుమల ప్రత్యేకాధికారి ఎవి.ధర్మారెడ్డి సోమవారం అశ్విని ఆసుపత్రికి చేరుకుని గాయపడిన మహిళను పరామర్శించారు. మహిళ వివరాలను అడిగి తెలుసుకున్నారు. అవసరమైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు.